Ballistic Missile Over Japan:  ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్.. ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించిందని మంగళవారం దక్షిణ కొరియా సైన్యం తెలిపింది.


జపాన్ మీదుగా


ఉత్తర కొరియా.. తూర్పు వైపున జపాన్‌ గగనతలం మీదుగా గుర్తు తెలియని బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించిందని దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాప్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జపాన్‌ కోస్ట్‌గార్డ్‌ కూడా ఉత్తర కొరియా బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం చేపట్టినట్లు ధ్రువీకరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జపాన్ హెచ్చరించింది. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని ప్రజలకు సూచించింది.


ఆగ్రహం 


ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగంపై జపాన్‌ ప్రధాని కిషిదా ఆగ్రహం వ్యక్తం చేశారు. అణ్వాయుధాలు కలిగిన దేశాలను రెచ్చగొట్టాలని ఉత్తర కొరియా ప్రయత్నిస్తోందని కిషిదా అన్నారు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.


ఇటీవల ఉత్తర కొరియా స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని సముద్రం వైపు ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. టైకాన్‌ అనే ప్రదేశం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి 60 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించి దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో పడిందని పేర్కొంది. ఈ ప్రయోగంపై దక్షిణ కొరియా సైన్యం తీవ్ర అభ్యంతరం తెలిపింది.


దక్షిణ కొరియాతో సంయుక్తంగా నిర్వహించనున్న సైనిక విన్యాసాల కోసం అమెరికా అణుశక్తి ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్యారియర్‌ రోనాల్డ్‌ రీగన్‌ కొరియా ద్వీపకల్పంలోని బుసాన్‌ పోర్టుకు చేరుకొంది. అదే సమయంలో ఈ క్షిపణి పరీక్ష జరగడం ఉద్రిక్తతలకు దారితీసింది. జపాన్‌ కోస్టు గార్డులు కూడా ఈ క్షిపణి పరీక్షను ధ్రువీకరించారు.









ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష తీవ్రమైన కవ్వింపు చర్య అని దక్షిణ కొరియా ఆరోపించింది.



ఈ క్షిపణి ప్రయోగాన్ని ఉత్తర కొరియా చేపట్టడం ముమ్మాటికీ కవ్వింపు చర్యగానే మేం భావిస్తున్నాం. ఎలాంటి చర్యలనైనా ప్రతిఘటించేందుకు మా సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది. అమెరికాతో కలిసి రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం. మరికొన్ని రోజుల్లో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ కూడా దక్షిణ కొరియాను సందర్శించనున్నారు.                                           "
-   దక్షిణ కొరియా



కొత్త చట్టం


ప్రపంచంపై రష్యా- ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉన్న వేళ ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల కొత్త బాంబు పేల్చారు. అణ్వాయుధాల వినియోగంపై ఓ కొత్త చట్టం తీసుకువచ్చారు. త‌న‌ను తాను ర‌క్షించుకునే సమయంలో ముంద‌స్తుగా అణ్వాయుధ దాడి చేసే రీతిలో ఉత్తర కొరియా ప్రభుత్వం ఈ చ‌ట్టాన్ని త‌యారు చేసింది. అణ్వాయుధీక‌ర‌ణ అంశంలో వెన‌క్కి త‌గ్గేది లేద‌ని కిమ్ జోంగ్ ఉన్ ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.


అణ్వాయుధాల వినియోగంపై వెనక్కి తగ్గేదే లేదు. మా దేశాన్ని రక్షించుకునే విషయంలో అవసరమైతే ముందుగా మేమే అణ్వాయుధాలు ప్రయోగిస్తాం.                               "




-కిమ్ జోంగ్ ఉన్, ఉత్తర కొరియా అధినేత



దేశానికి న్యూక్లియ‌ర్ స్టేట‌స్ ఇస్తూ నార్త్ కొరియా పార్ల‌మెంట్ ఈ కొత్త చ‌ట్టాన్ని రూపొందించింది. అటామిక్ ఆయుధాల‌ను ఆటోమెటిక్‌గా వాడుకునే అవ‌కాశాన్ని మిలిట‌రీకి క‌ల్పిస్తున్న‌ట్లు కొత్త చ‌ట్టంలో పేర్కొన్నారు.


Also Read: Cocaine Seized In Mumbai: లోదుస్తుల్లో దాచి కొకైన్ అక్రమ రవాణా- ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో పట్టుకున్న అధికారులు!