J&K DGP Prisons Hemant Kumar Lohia Murder: జమ్మూకాశ్మీర్ లో దారుణం జరిగింది. జమ్మూకాశ్మీర్ జైళ్ల శాఖ డైరక్టర్ జనరల్ హేమంత్ కుమార్ లోహియా(57) దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. జమ్మూలోని ఆయన నివాసంలోనే హేమంత్ కుమార్  అక్టోబర్ 3న రాత్రి హత్యకు గురయ్యారని సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు తెలిపారు. ఇది బయటి వ్యక్తుల పని కాదని, ఇంటి పని మనిషే డీజీపీని గొంతు కోసి, హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని దహనం చేసేందుకు దండుగులు ప్రయత్నించారని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు జమ్మూ జోన్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ముకేశ్ సింగ్‌ వెల్లడించారు.


హత్యకు ముందు డీజీ హేమంత్ కుమార్ ఏదో ఆయింట్ మెంట్, నూనే రాసుకున్నారు. కరెక్టు అదే సమయంలో ఆయనపై వెనుక నుంచి దాడి చేసి ఊపిరాడకుండా చేశారు. పగిలిన గాజు సీసాతో గొంతు కోసి జైళ్ల శాఖ డీజీని దారుణంగా హత్య చేశారు. సాక్ష్యాలు దొరక్కకుండా చేసేందుకు ఆ పనివాడు డీజీ మృతదేహాన్ని తగలబెట్టే ప్రయత్నం చేయగా.. పొగలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూశారు. కానీ అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయిందని, హేమంత్ కుమార్ చనిపోయి, ఆయన శరీరం కొంత భాగం కాలిపోయినట్లు సిబ్బంది గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న పని వాడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా,  1992 బ్యాచ్‌కు చెందిన హేమంత్ కుమార్ లోహియా, ఆగస్టులో ప్రమోషన్ రావడంతో జమ్ముాకశ్మీర్ జైళ్ల శాఖ డీజీగా బాధ్యతలు స్వీకరించారు. కానీ అంతలోనే విషాదం చోటుచేసుకుంది.


ఇది మా పనే.. పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ ప్రకటన
జైళ్ల శాఖ డీజీని హత్య చేయడంతో పాటు ఇది తమ పనేనంటూ  ఓ కీలక ప్రకటన వెలువడింది. హేమంత్ కుమార్ లోహియా హత్య తమ పనేనంటూ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్  (పీఏఎఫ్ఎఫ్) ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, ప్రత్యేక నిఘాతో తమ టీమ్ ఈ పని పూర్తి చేసిందని ప్రకటనలో ఉంది. 






జమ్మూలో పర్యటించనున్న అమిత్ షాకు గిఫ్ట్..
కేంద్ర హోం మంత్రి అమిత్ షా మూడు రోజులపాటు జమ్మూకాశ్మీర్ లో పర్యటించనున్నారు. మంగళవారం నుంచి మూడు రోజులు పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బహిరంగ సభల్లో పాల్గొననుండగా జమ్మూకాశ్మీర్ జైళ్లశాఖ డీజీ హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. పటిష్ట భద్రత మధ్య కాశ్మీర్ పర్యటనకు రానున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఇది మా గిఫ్ట్ అంటూ పీఏఎఫ్ఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది. హిందుత్వ పాలకులను, వారి భాగస్వాములను హెచ్చరించేందుకే తాము ఈ పని చేసినట్లు పేర్కొన్నారు. హై ప్రొఫైల్ ఉన్నవారిని టార్గెట్ చేసుకుని, అంతం చేస్తామనడానికి ఇది కేవలం ఆరంభం మాత్రమేనని కొత్తగా ఏర్పడిన ఈ ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది.