AP Students Private Schools :   ఇది షాకింగ్ లాంటిదే. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం చెబుతున్నదాన్ని బట్టి చూస్తే.. జరుగుతున్నది తెలుసుకుంటే అలాగే అనిపిస్తుంది. గత ప్రభుత్వాలు ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేశాయని.., తాము వచ్చాక నాడు నేడు , అమ్మ ఒడి వంటి వాటితో అందరూ ప్రభుత్వ స్కూళ్ల వైపు పరుగులు పెట్టేలా చేశామని ప్రభుత్వం చెబుతూ ఉంటుంది.కానీ ఈ ఏడాది లెక్కలు పూర్తిగా తప్పాయి. ఐదున్నర లక్షల మందికిపైగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు డ్రాపౌట్ అయ్యారు. వీరిలో అత్యధికులు ప్రైవేటు స్కూళ్లలోచేరిపోగా.. కొంత మంది చదువు మానేశారు. దీనంతటికి కారణం ఏమిటి అనేది ఇప్పుడు కీలక విషయంగా మారింది. 


ప్రభుత్వ స్కూళ్లలో భారీగా తగ్గిన విద్యార్థులు !


ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు సంఖ్య ఈ ఏడాది పడిపోయింది. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య బాగా తగ్గింది. ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా సగానికి సగం మంది తగ్గారు. 2021-22 విద్యాసంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను ప్రస్తుత విద్యా సంవత్సరంతో పోలిస్తే ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో కలిపి 5.81 లక్షల మంది విద్యార్థులు బడికి దూరమయ్యారని తేలింది. 2020-21 విద్యా సంవత్సరంలో దాదాపుగా 44 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. 2021-22లో ఈ సంఖ్య పెరిగింది.   ప్రస్తుత విద్యాసంవత్సరం విద్యార్థుల సంఖ్య 39 లక్షలకు  పడిపోయినట్లుగా ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి.  మరోపక్క ఎయిడెడ్‌ పాఠశాలల్లో కూడా ఎన్‌రోల్‌మెంట్‌ దారుణంగా పడిపోయింది. 2020-21 విద్యాసంవత్సరానికి, ప్రస్తుత విద్యాసంవత్సరానికి తేడా ఉంది. 2020-21లో ఎయిడెడ్‌ పాఠశాలల్లో రెండు లక్షల మంది  విద్యార్థులు ఉన్నారు. 2021-22లో 1,64,248 మంది ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య లక్షా ఆరు వేలకు పడిపోయినట్లుగా తెలుస్తోంది.  అయితే ప్రభుత్వం అధికారికంగా లెక్కలు విడుదలచేయలేదు. 


రెండేళ్ల పాటు పెరిగి హఠాత్తుగా పడిపోయిన విద్యార్థులసంఖ్య !


కరోనా వల్ల 2020-21, 2021-22 విద్యాసంవత్సరాల్లో ప్రైవేట్‌ పాఠశాలలు జరగకపోవడంతో ఫీజులు చెల్లించలేక తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు పంపారు. 2019-20 విద్యా సంవత్సరంలో పోల్చుకుంటే 2020-21లో ప్రభుత్వ పాఠశాలల్లో 5,39,986 మంది, 2021-22లో 5,74,128 మంది విద్యార్థులు అదనంగా చేశారు. ఈ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పాఠశాలల విలీనం పేరుతో తల్లిదండ్రుల్లో భయాందోళన నెలకొంది. దీంతో విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల బాట పట్టారు.


ప్రభుత్వ పాఠశాలల విలీనమా ? బలవంతపు ఇంగ్లిష్ మీడియమా ?


ప్రభుత్వం విద్యా శాఖలో కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేస్తోంది. ఇటీవల పాఠశాలల్ని విలీనం చేసింది.  ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో దూరాభారం అవడం వల్ల చాలా మంది బడి మానేశారు. మరి కొంత మంది సమీపంలోని ప్రైవేటు స్కూళ్లలో చేరిపోయారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం మొత్తం ఇంగ్లిష్ మీడియంను అమలు చేయడం ప్రారంభించింది. చట్ట ప్రకారంగా తెలుగు మీడియా కూడా నిర్వహించాల్సి ఉంది. కానీ తెలుగు మీడియంను అనధికారికంగా నిలిపివేశారు. ఇంగ్లిష్ మీడియంలోనే బలవంతంగా చేర్పించేశారు. ఈ కారణంగా లక్షల్లో డ్రాపౌట్‌లు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. 


ప్రభుత్వం  దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందా ?


ప్రభుత్వ స్కూళ్ల మీద ... పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారు.  వేల కోట్లతో పథకాలు అమలు చేస్తున్నారు. నాడు - నేడు పేరుతోనూ వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరగాలి. కానీ తగ్గితే ప్రభుత్వ కృషి ఫలించనట్లే.