వరంగల్‌లోని  కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ నిర్వహించిన ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షా పత్రం లీకైందన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాలు, వైద్య సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ విషయమై వైద్య, విద్యార్థి సంఘాలు వారం రోజులుగా డిమాండ్‌ చేస్తున్నా కాళోజీ హెల్త్‌ వర్సిటీ యాజమాన్యం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


Also Read: బీసీ గురుకులాల్లో డిగ్రీ ప్రవేశాలు, దరఖాస్తుకు కొద్దిరోజులే గడువు!


ఈ విషయమై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావుకు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం నుంచి కూడా స్పందన కరువైందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. అసలు కాళోజీ వర్సిటీ చేపట్టే ప్రతి విద్యా కరికులమ్‌ కార్యక్రమాలు, నిర్ణయాలు ఎప్పటినుంచో వివాదాస్పదమవుతూనే ఉన్నాయి. గతంలో సీట్ల బ్లాకింగ్‌, అనుమతులు రద్దయిన ప్రైవేటు వైద్య కాలేజీల విద్యార్థుల సర్దుబాటు, పీజీ వైద్య సీట్ల బ్లాకింగ్‌తో మెడికోలను వర్సిటీ యాజమాన్యం ముప్పు తిప్పలు పెట్టింది.



Also Read: అక్టోబరు 12 నుంచి ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు కౌన్సెలింగ్!



ఆ ఇబ్బందులను విద్యార్థులు మరువకముందే ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు పేపర్‌ లీకేజీ ఆరోపణల విషయంలో స్పందించకుండా నిర్లక్ష్యం ఉండి మరో సమస్యను వర్సిటీ సృష్టించినట్లయింది. వర్సిటీ పరిధిలో ఎంబీబీఎస్‌ మొదటి ఏడాది పరీక్షను 5వేల మంది విద్యార్థులు రాయగా అందులో దాదాపు 50శాతం కంటే ఎక్కువ మంది ఫెయిల్‌ అయ్యారు. అయితే ఆ వెంటనే నిర్వహించిన ఇన్‌స్టాంట్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో 7శాతం విద్యార్థులు మినహా అంతా పాసయ్యారు.



Also Read: జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?



సప్లిమెంటరీ పరీక్షల్లో ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉత్తీర్ణులవడంపై అనుమానం వచ్చిన అధ్యాపక, విద్యార్థి సంఘాలు చేసిన పరిశీలనలో ప్రశ్నాపత్రం లీకైనట్లు తేలింది. ఇన్‌స్టంట్‌ పరీక్షలో దాదాపు 92.5శాతం విద్యార్థులు పాసవడం పేపర్‌ లీకేజీ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. తాజాగా ఎంబీబీఎస్‌ ఇన్‌స్టాంట్ పేపర్‌ లీకేజీ ఆరోపణలతోపాటు గతంలో సీట్ల బ్లాకింగ్‌తో వర్సిటీ ఉన్నతాధికారులు కోట్లలో దండుకున్నారన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి.



Also Read: మహిళా 'ప్రతిభ'కు చేయూత 'ప్రగతి' స్కాలర్‌షిప్‌!! దరఖాస్తు చేసుకోండి..



ఎంబీబీఎస్‌ సప్లిమెంటరీ పరీక్ష కంటే ఒక రోజు ముందే ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం పరీక్షా పత్రం వాట్సాప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొట్టిందని టీపీటీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ ఏ విజయ్‌ కుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టీ. నాగరాజు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై వారు ఇప్పటికే వర్సిటీ యజామాన్యంతోపాటు మంత్రి హరీష్‌రావుకు ఆధారాలతో సహా పేపర్‌ లీకేజీ అంశాన్ని వివరించారు. లీకేజీలో స్వయంగా వర్సిటీ అధికారులకు సంబంధం ఉందని ఆరోపిస్తున్నారు. వెంటనే పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..



⇒   జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?


⇒  
నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతి ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?



⇒  
AUSDE: ఏయూ దూరవిద్య కోర్సుల నోటిఫికేషన్‌ విడుదల




మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..