Hetmyer Ruled Out Of WI T20 World Cup Squad 2022: ఈ నెలలో ప్రారంభం కానున్న పొట్టి ప్రపంచ కప్ కోసం దాదాపుగా అన్ని జట్లు తమ 15 మంది ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. కొందరు ఆటగాళ్లు గాయంతో జట్టుకు దూరం కాగా, ఓ స్టార్ క్రికెటర్ మాత్రం వినూత్నంగా టీ20 ప్రపంచ కప్ నుంచి దూరమయ్యాడు. ఫ్లైట్ మిస్ చేసుకున్న కారణంగా టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ జట్టులో వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ షిమ్రాన్ హిట్‌మేయర్ చోటు కోల్పోయాడు. ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిన విమానాన్ని రెండు సార్లు మిస్ కావ‌డంతో అతడ్ని జట్టు నుంచి తప్పించింది విండీస్ బోర్డు. 


విండీస్ బోర్డు కీలక నిర్ణయం


ఆస్ట్రేలియాతో జ‌ర‌గాల్సిన తొలి టీ20 మ్యాచ్‌కు కూడా హిట్‌మేయ‌ర్ దూరం అయ్యాడు. అయితే కుటుంబ కారణాలతో అతడు జట్టు ఆటగాళ్లతో పాటు ఆస్ట్రేలియాకు వెళ్లలేకపోయాడు. అతడి పరిస్థితి అర్థం చేసుకున్న విండీస్ క్రికెట్ బోర్డు మరోసారి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి, ఛాన్స్ ఇచ్చింది. రెండో ప్రయత్నంలోనూ హెట్‌మేయర్ విమానాన్ని అందుకోలేకపోవడంతో అతడి ప్రయాణం మరోసారి వాయిదా పడింది. దీంతో విండీస్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ బ్యాటర్ హిట్‌మేయర్ ను టీ20 వరల్డ్ కప్ జట్టు (WI T20 World Cup Squad 2022) నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించింది. 






రెండు సార్లు ఫ్లైట్ మిస్, బోర్డు సీరియస్..
తన వ్యక్తిగత కారణాల వల్ల హిట్‌మేయర్ మొదట అక్టోబ‌ర్ 1వ తేదీన‌ విమానాన్ని అందుకోలేకపోయాడు. ఈ విషయాన్ని తెలపడంతో బోర్డు అక్టోబ‌ర్ మూడో తేదీన ఈ స్టార్ బ్యాటర్ కోసం మ‌రో విమానంలో సీటు బుక్ చేసింది. అయితే సోమ‌వారం కూడా సరైన టైమ్ కు ఎయిర్ పోర్టుకు చేరుకోలేకపోయాడు. దీంతో బోర్డు అతడిపై సీరియస్ అయింది. హెట్‌మేయర్ ను టీ20 ప్రపంచ కప్ జట్టు నుంచి తప్పించడంతో పాటు అతడి స్థానంలో షామా బ్రూక్స్‌ను జట్టులోకి తీసుకుంది. పొట్టి ప్రపంచ కప్ లో భాగంగా అక్టోబర్ 17న స్కాట్లాండ్‌తో వెస్టిండీస్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది.  


భారత స్టార్ ప్లేయర్లు సైతం.. కప్ కష్టమేనా !
భారత బెస్ట్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పటికే మోకాలి గాయం కారణంగా త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు దూరం అయ్యాడు. ఇప్పుడు స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా కూడా దూరం కావడంతో బౌలింగ్ లైనప్ విషయంలో టీమిండియా కష్టాలు రెట్టింపయ్యాయని అని చెప్పవచ్చు. వెన్ను గాయం కారణంగా బుమ్రా 2022లోనే ఆసియా కప్‌కు దూరమయ్యాడు. అతను కోలుకోవడానికి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఒక నెల గడిపినా ప్రయోజనం లేకపోయింది. కీలక ఆటగాళ్ల సేవలు కోల్పోవడంతో భారత్ విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపనుంది.