Bumrah On T20 World Cup: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు దూరమైనందుకు బాధగా ఉందని టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. తనకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేశాడు. జట్టుకు దూరంగా ఉన్నా ఆస్ట్రేలియాలో హిట్‌మ్యాన్‌ సేన విజయ యాత్రను ఎంజాయ్‌ చేస్తానని పేర్కొన్నాడు. ఈ మేరకు మంగళవారం ట్వీట్‌ చేశాడు.


టీ20 వరల్డ్ కప్ ముందు జస్ప్రీత్‌ బుమ్రా దూరమవ్వడం టీమిండియాకు భారీ షాక్! భారత పేస్ దళంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది అతడే కావడం గమనార్హం. అత్యంత వేగంగా, చక్కని లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బంతులు వేయడం అతడి ప్రత్యేకత. ఓవర్‌లో చురకత్తుల్లాంటి యార్కర్లు సంధించి వికెట్లు పడగొడతాడు. ఆస్ట్రేలియా సిరీసు తర్వాత అతడు గాయపడ్డాడు. కొన్నాళ్లు అతడి గాయం తీవ్రతను పర్యవేక్షించిన బీసీసీఐ టీ20 ప్రపంచకప్‌నకు దూరమయ్యాడని ప్రకటించింది. సర్జరీ అవసరం లేనప్పటికీ గాయం నుంచి కోలుకోవడానికి బుమ్రాకు కనీసం నాలుగు నుంచి ఆరు నెలల సమయం పట్టనుందని సమాచారం.






'టీ20 ప్రపంచకప్‌నకు దూరమయ్యానని తెలిసి బాధపడుతున్నా. ఏదేమైనా నేను ప్రేమించేవారి నుంచి సపోర్ట్‌, కేర్‌, విషెష్‌ దొరికినందుకు కృతజ్ఞతలు. నేను రికవరీ అవుతూనే మరోవైపు ఆసీస్‌లో టీమ్‌ఇండియా జైత్రయాత్రను ఆనందిస్తాను' అని బుమ్రా సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టాడు.


వెన్ను గాయం కారణంగా బుమ్రా 2022లోనే ఆసియా కప్‌కు దూరమయ్యాడు. అతను కోలుకోవడానికి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఒక నెల గడిపినా ప్రయోజనం లేకపోయింది. బుమ్రా ఆడబోవడం లేదని గత 10 రోజుల నుంచే వార్తలు వచ్చాయి. ఈ గాయం కారణంగానే దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ నుంచి కూడా బుమ్రాను పక్కన పెట్టారు.


భారత బెస్ట్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పటికే మోకాలి గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌కు దూరం అయ్యాడు. ఇప్పుడు బుమ్రా కూడా దూరం కావడంతో బౌలింగ్ లైనప్ విషయంలో టీమిండియా కష్టాలు రెట్టింపయ్యాయని అని చెప్పవచ్చు. వీరి గైర్హాజరు టోర్నమెంట్ విజయావకాశాలపైనే ప్రభావం చూపించనుంది.