ఎప్పటినుంచో వినిపిస్తున్న పుకార్లు నిజం అయ్యాయి. టీ20 వరల్డ్ కప్ ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత పేస్ దళంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న జస్‌ప్రీత్ బుమ్రా టీ20 వరల్డ్ కప్‌కు గాయం కారణంగా దూరం అయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. బీసీసీఐ మెడికల్ టీం సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వెన్ను గాయం కారణంగానే బుమ్రా ఈ టోర్నీకి దూరం అయ్యాడు. బుమ్రా గాయానికి సర్జరీ అవసరం లేనప్పటికీ గాయం నుంచి కోలుకోవడానికి కనీసం నాలుగు నుంచి ఆరు నెలల సమయం పట్టనుందని తెలుస్తోంది.


వెన్ను గాయం కారణంగా బుమ్రా 2022లోనే ఆసియా కప్‌కు దూరమయ్యాడు. అతను కోలుకోవడానికి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఒక నెల గడిపినా ప్రయోజనం లేకపోయింది. బుమ్రా ఆడబోవడం లేదని గత 10 రోజుల నుంచే వార్తలు వచ్చాయి. ఈ గాయం కారణంగానే దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ నుంచి కూడా బుమ్రాను పక్కన పెట్టారు.


భారత బెస్ట్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పటికే మోకాలి గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌కు దూరం అయ్యాడు. ఇప్పుడు బుమ్రా కూడా దూరం కావడంతో బౌలింగ్ లైనప్ విషయంలో టీమిండియా కష్టాలు రెట్టింపయ్యాయని అని చెప్పవచ్చు. వీరి గైర్హాజరు టోర్నమెంట్ విజయావకాశాలపైనే ప్రభావం చూపించనుంది.


బుమ్రా ఆడకపోవడంతో మరి తన స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై కొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన రానుందని బీసీసీఐ ప్రకటించింది.  ఇప్పటికే ప్రకటించిన టీ20 ప్రపంచకప్ జట్టులో స్టాండ్ బై ప్లేయర్‌లుగా ఉన్న మహ్మద్ షమీ లేదా దీపక్ చాహర్‌ల్లో ఒకరికి చాన్స్ దక్కనుంది. దక్షిణాఫ్రికా సిరీస్‌లో మెరుగ్గా బౌలింగ్ వేస్తున్న దీపక్ చాహర్‌ను సెలక్ట్ చేస్తారా? సీనియారిటీకి మొగ్గు చూపి షమీకి ఓటు వేస్తారా అనేది తెలియాల్సి ఉంది.