మహిళల ఆసియాకప్‌లో భారత్‌కు వరుసగా రెండో విజయం లభించింది. సోమవారం మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 30 పరుగులతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అనంతరం మలేషియా 5.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 16 పరుగుల మీద ఉన్నప్పుడు వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది.


వర్షం ఆగినప్పటికీ అవుట్‌ఫీల్డ్‌లో నీరు ఉండటంతో మ్యాచ్ జరిగితే పరిస్థితి కనిపించలేదు. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో విజేతను ప్రకటించారు. తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (69: 53 బంతుల్లో, 11 ఫోర్లు, ఒక సిక్సర్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.


మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్లు సబ్బినేని మేఘన (69: 53 బంతుల్లో, 11 ఫోర్లు, ఒక సిక్సర్), షెఫాలీ వర్మ (46: 39 బంతుల్లో, ఒక ఫోర్లు, మూడు సిక్సర్లు) శుభారంభం అందించారు. మొదటి వికెట్‌కు 83 బంతుల్లోనే 116 పరుగులు జోడించారు. కృష్ణా జిల్లాకు చెందిన తెలుగమ్మాయి సబ్బినేని మేఘన వేగంగా ఆడింది. బౌండరీలతో చెలరేగింది. మరో ఓపెనర్ షెఫాలీ తనకు చక్కటి సహకారం అందించింది. వేగాన్ని పెంచే క్రమంలో సబ్బినేని మేఘన అవుటయినప్పటికీ వన్‌డౌన్‌లో రిచా ఘోష్ (33: 19 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) చెలరేగడంతో భారత్ భారీ స్కోరు చేసింది. మలేషియా బౌలర్లలో వినిఫ్రెడ్ దురైసింగం, నుర్ దానియా స్యుహాదా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.


అనంతరం భారత్ వ్యూహాత్మకంగా బరిలోకి దిగింది. వర్షం పడే సూచనలు కనిపించడంతో డక్‌వర్త్ లూయిస్‌లో ఫలితం రావడానికి అవసరమైన ఐదు ఓవర్లు వేగంగా వేయించడానికి స్పిన్నర్లను కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ రంగంలోకి దించింది. ఈ వ్యూహం ఫలించింది. సరిగ్గా 5.2 ఓవర్ల తర్వాత వర్షం పడటంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్‌ను విజయం వరించింది.