Shobha Karandlaje Tamilians Remark: కేంద్రమంత్రి శోభా కరంద్లాజే (Shobha Karandlaje) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు కేసు నిందితుడు తమిళనాడుకి చెందిన వ్యక్తే అని అన్నారు. దీనిపై తమిళులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ కూడా ఈ కామెంట్స్‌పై ఫైర్ అయ్యారు. తమిళనాడుకి చెందిన వ్యక్తే కేఫ్‌లో బాంబు పెట్టాడంటూ శోభా చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. స్టాలిన్ విమర్శలకి కౌంటర్ ఇచ్చిన ఆమె ఆ తరవాత క్షమాపణలు చెప్పారు. రామేశ్వరం పేలుడు కేసులో ప్రధాన నిందితుడు తమిళాడులోని కృష్ణగిరి అడవుల్లోనే శిక్షణ పొందాడని ఆరోపించారు శోభ కరంద్లాజే. ఆమె చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
"తమిళనాడుకి చెందిన వాళ్లే ఈ అడవుల్లోకి వస్తుంటారు. ఇక్కడే ట్రైనింగ్ తీసుకుంటారు. బాంబులు ఎలా పెట్టాలో నేర్చుకుంటారు. అలా నేర్చుకున్న వ్యక్తే రామేశ్వరం కేఫ్‌లో బాంబు పెట్టాడు"
- శోభా కరంద్లాజే
ఈ వీడియోని రీట్వీట్ చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ తీవ్రంగా మండి పడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలా ఎలా మాట్లాడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
"ఎలాంటి ఆధారాల్లేకుండా ఇలా ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం సరికాదు. బీజేపీని పక్కన పెట్టేయడంలో తమిళులు, కన్నడిగులు ఒకేరకంగా ఆలోచిస్తారు. జాతీయ సమైక్యతకి, శాంతియుత వాతావరణానికి ఇబ్బంది కలిగించే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రతి ఒక్కరూ ఇలాంటి రాజకీయాలు చేసే వాళ్లే. ఎన్నికల సంఘం ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించాలి"
- ఎమ్‌కే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి
ఆ తరవాత కేంద్రమంత్రి క్షమాపణలు చెబుతూ X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. తమిళ ప్రజలందరినీ క్షమాపణలు కోరారు. మనోభావాలు దెబ్బ తీయడం తన ఉద్దేశం కాదని చెప్పారు. ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించారు.
"తమిళనాడు ప్రజలందరినీ క్షమాపణలు చెబుతున్నాను. మీ మనోభావాలు దెబ్బ తీయాలని నేనీ వ్యాఖ్యలు చేయలేదు. కేవలం కృష్ణగిరి అడవుల్లో ట్రైనింగ్ అవుతున్న వారి గురించి మాత్రమే మాట్లాడాను. నా వ్యాఖ్యలతో ఎవరైనా బాధ పడి ఉంటే క్షమించండి. ఆ వ్యాఖ్యల్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను"
- శోభా కరంద్లాజే, కేంద్ర మంత్రి
Also Read: రామ్ దేవ్ బాబాకి సుప్రీంకోర్టు నోటీసులు, పతంజలి ప్రకటనలపై తీవ్ర అసహనం