Baba Ramdev Summoned by Supreme Court: పతంజలి ఆయుర్వేద ప్రకటనలపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటికే కోర్టు ఈ విషయమై యోగా గురు రామ్ దేవ్ బాబాని మందలించింది. పతంజలి ప్రకటనలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని, దీనిపై వివరణ ఇవ్వాలని గతంలోనే ఆదేశించింది. అయితే...దీనిపై కోర్టు ధిక్కరణ నోటీసులు పంపింది. కానీ...రామ్ దేవ్ బాబా స్పందించలేదు. ఆయన స్పందించకపోవడంపై అసహనం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు సమన్లు జారీ చేసింది. కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. జస్టిస్ హిమా కోహ్లి,అహసనుద్దీన్ అమనుల్లాతో కూడిన ధర్మాసనం రామ్ దేవ్ బాబాతో పాటు పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణకీ నోటీసులు పంపింది. గత నెల పతంజలిపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండి పడింది. తమ ఉత్పత్తులకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలు, స్టేట్‌మెంట్‌లు ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేసింది. అందులో ఔషధ గుణాలున్నాయని ప్రచారం చేసుకోవడంపైనా మండి పడింది. నిబంధనలు ఉల్లంఘించడంపై మందలించింది. పతంజలితో పాటు బాలకృష్ణకి నోటీసులు పంపింది. కోర్టు ధిక్కరణ చేసినందుకు వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అడిగింది.
సుప్రీంకోర్టు నోటీసులపై పతంజలి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ప్రెస్‌మీట్ పెట్టినప్పటికీ కోర్టు నోటీసులపై స్పందించలేదు. "ఇప్పటి వరకూ మీరు ఎందుకు స్పందించలేదు..? వచ్చే విచారణ సమయానికి పతంజలి ఎండీ కోర్టులో హాజరు కావాలి" అని స్పష్టం చేసింది. Drugs and Remedies Act లోని సెక్షన్ 3&4 నిబంధనల్ని రామ్‌దేవ్, బాలకృష్ణ ఉల్లంఘించారని సుప్రీంకోర్టు వెల్లడించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలపై దృష్టి పెట్టాలని తేల్చి చెప్పింది. పతంజలి కో ఫౌండర్‌కి నోటీసులివ్వడంపై ఆయన తరపున న్యాయవాది ముకుల్ రోహ్‌తగీ వాదించారు. ఆయనకు ఈ కేసుకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. కానీ కోర్టు మాత్రం "తప్పకుండా హాజరు కావాల్సిందే" అని వెల్లడించింది. Indian Medical Association (IMA) వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సమయంలో ఈ వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై రామ్‌దేవ్ బాబా ఆరోపణలు చేయడాన్ని IMA తప్పుబట్టింది. ఫిబ్రవరి 27వ తేదీన పతంజలికి కోర్టు ధిక్కరణ నోటీసులు పంపింది. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంపైనా అసహనం వ్యక్తం చేసింది. గతంలో చాలా సందర్భాల్లో రామ్ దేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలోపతి వైద్యంతో అందరినీ మోసం చేస్తున్నారంటూ మండి పడ్డారు. ఈ కామెంట్స్‌పై అప్పట్లో వైద్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు అప్పుడు కూడా రామ్ దేవ్ బాబాని మందలించింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని తేల్చి చెప్పింది. ఓ సందర్భంలో మహిళలపైనా నోరు జారారు రామ్ దేవ్ బాబా. "మహిళలు చీరలు కట్టుకున్నా అందంగా ఉంటారు. సల్వార్ వేసుకున్నా బాగా కనిపిస్తారు. నాకైతే వాళ్లు ఏమీ వేసుకోకపోయినా అందంగా కనిపిస్తారు" అని అన్నారు. ఈ కామెంట్స్ చేసిన సమయంలో వేదికపై మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృత ఫడణవీస్ కూడా ఉన్నారు.
Also Read: ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లలో వరుస చోరీలు, రూ.కోటి విలువైన ఛార్జింగ్ గన్స్ మాయం