Delta Airlines Pilot Drunk: స్కాట్‌లాండ్ నుంచి అమెరికాకి వెళ్తున్న Delta Airlines ఫ్లైట్‌లో పైలట్ కాసేపు అందరినీ టెన్షన్ పెట్టాడు. మద్యం మత్తులోనే ఫ్లైట్‌ని నడిపేందుకు వెళ్లాడు. గుర్తించిన అధికారులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. 10 నెలల జైలుశిక్ష కూడా విధించారు. Guardian వెల్లడించిన వివరాల ప్రకారం...63 ఏళ్ల కేప్టెన్ లారెన్స్ రసెల్ నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి మద్యం సేవించాడు. గతేడాది జూన్ 16వ తేదీన ఈ ఘటన జరిగింది. బ్యాగేజ్ కంట్రోల్ వద్ద రసెల్ బ్యాగ్ చెక్ చేయగా అందులో రెండు వైన్ బాటిల్స్ కనిపించాయి. పైగా అవి రెండూ ఓపెన్ చేసిన ఉన్నాయి. అప్పటికే సగం ఖాళీ చేశాడు రసెల్. ఆ తరవాత బ్రీథ్ టెస్ట్ కూడా చేశారు. రక్తంలో ఆల్కహాల్ పరిమితికి మించి గుర్తించారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు ఇటీవల ఆ పైలట్‌కి పది నెలల శిక్ష విధించింది. విధుల్లో ఉన్నప్పుడు మద్యం సేవించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రయాణికుల భద్రత అనేది చాలా కీలకం అని దీన్ని దృష్టిలో పెట్టుకునే జైలు శిక్ష విధించినట్టు కోర్టు స్పష్టం చేసింది.
"లారెన్స్ రసెల్ చేసిన పనికి చాలా మంది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడిపోయాయి. ఏదైనా జరగరానిది జరిగి ఉంటే ఏం చేసే వాళ్లం. ప్యాసింజర్స్ సేఫ్‌టీ గురించి పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడాడు. ఇలాంటి నేరాల్ని అసలు ఉపేక్షించేది లేదు"
- కోర్టు
గతంలోనూ రెండుసార్లు ఇదే విధంగా విధుల్లో ఉన్నప్పుడు మద్యం సేవించి వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. Federal Aviation Administration నిబంధనల ప్రకారం రక్తంలో 0.04% కన్నా ఎక్కువ ఆల్కహాల్ ఉండకూడదు. అంతకు మించి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటారు. నేర తీవ్రతని బట్టి గరిష్ఠంగా రెండేళ్ల వరకూ జైలుశిక్ష విధిస్తారు.