IPL introduces Smart Replay System for quicker, more accurate reviews:  ఐపీఎల్‌ ఫీవర్‌ ప్రపంచాన్ని ఊపేస్తోంది. దిగ్గజ ఆటగాళ్ల మెరుపులను.. బౌలర్ల మ్యాజిక్‌ను చూసేందుకు క్రికెట్‌ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 40 ఓవర్ల పాటు  ఇరు జట్లు కొదమ సింహాల్లా పోరాడుతున్నప్పుడు  ఒక్క పరుగు కూడా చాలా కీలకంగా మారుతుంది. ఒక్క పరుగుతో... ఒక్క క్యాచ్‌తో.. ఒక్క వికెట్‌తో.. ఒక్క తప్పుడు నిర్ణయంతీ మ్యాచ్‌ స్వరూపమే మారిపోయన ఘటనలు చాలా ఉన్నాయి. అందుకే ప్రతీ నిమిషం ఐపీఎల్‌లో అత్యంత ముఖ్యమైనది. ఒక తప్పుడు నిర్ణయం మ్యాచ్‌నే కాదు టైటిల్‌ను కూడా దూరం చేయాల్సి రావచ్చు. అందుకే ఐపీఎల్‌ను బీసీసీఐ(BCCI) అత్యంత ప్రతిష్టాత్మకంగా చూస్తుంది. క్రికెట్‌(Cricket) ప్రపంచం దృష్టంతా ఐపీఎల్‌పైనే ఉండనుండడంతో ఏ చిన్న పొరపాటుకు... తప్పుడు నిర్ణయానికి తావు లేకుండా అధునాతన సాంకేతికతను వాడుతోంది. ఐపీఎల్‌ 17వ సీజన్‌లో కొత్త సిస్టమ్‌ను బీసీసీఐ ప్రవేశపెట్టింది. అంపైర్‌లు వేగంగా, ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునేందుకు స్మార్ట్ రీప్లే సిస్టమ్‌ను అమలు చేయనుంది.




 

అధునాతన సాంకేతికత 

ఈసారి ఐపీఎల్‌ 2024 సీజన్లో హాక్-ఐ హై-స్పీడ్ కెమెరాలు మైదానం నలు వైపులా ఉంటాయి. ఈ కెమెరాలను పెయిర్స్‌గా ఉంచుతారు, గ్రౌండ్‌కు రెండు వైపులా, స్ట్రైట్‌ బౌండరీల వద్ద రెండు, స్క్వేర్ లెగ్ పొజిషన్‌ రెండు వైపులా ఉంటాయి. కొత్త సిస్టమ్‌లో టీవీ అంపైర్ ఇద్దరు హాక్-ఐ ఆపరేటర్లు ఒకే గదిలో కలిసి పని చేస్తారు. ఇద్దరు ఆపరేటర్లు, గ్రౌండ్‌లోని ఎనిమిది హాక్-ఐ హై-స్పీడ్ కెమెరాల ద్వారా క్యాప్చర్‌ చేసిన ఇమేజ్‌లను టీవీ అంపైర్‌కి అందజేస్తారు. గతంలో హాక్-ఐ ఆపరేటర్లు, థర్డ్ అంపైర్ మధ్య మధ్యవర్తిగా వ్యవహరించిన టీవీ బ్రాడ్‌కాస్ట్‌ డైరెక్టర్ రోల్, కొత్త సిస్టమ్‌లో అవసరం లేదు. అంటే ఇన్ని కెమెరాల నుంచి వచ్చిన అన్ని దృశ్యాలను నిశితంగా పరిశీలించి అంపైర్లు తుది నిర్ణయం వెలువరిస్తారు.

 

టీవీ అంపైర్‌ కోసం...

టీవీ అంపైర్ ఇప్పుడు మునుపటి కంటే స్ప్లిట్-స్క్రీన్ ఇమేజ్‌లు సహా మరిన్ని విజువల్స్‌ను పరిశీలించి నిర్ణయాన్ని వెలువరిస్తాడు. సింక్రనైజ్డ్‌ వీడియో ఫుటేజ్‌తో బౌండరీ క్యాచ్‌లకు సంబంధించిన నిర్ణయాలు మరింత కచ్చితమైనవిగా, వేగంగా వస్తాయి. ఓవర్‌త్రో ద్వారా ఫోర్ వచ్చినప్పుడు, త్రో సమయంలో బ్యాటర్‌లు క్రాస్‌ అవుతున్నారో లేదో కూడా చాలా కచ్చితంగా అంచనా వేయనున్నారు. ఇటీవల ఎంపిక చేసిన అంపైర్లకు బీసీసీఐ రెండు రోజుల వర్క్‌షాప్‌ను నిర్వహించింది, వారిలో దాదాపు 15 మంది భారత్‌, విదేశీ అంపైర్లు ఐపీఎల్‌ 2024లో స్మార్ట్ రీప్లే సిస్టమ్‌తో పని చేస్తారు. హాక్-ఐ, బాల్‌ మూవ్‌మెంట్స్‌ను క్యాప్చర్‌ చేయడానికి గ్రౌండ్‌ చుట్టూ ఉంచిన హై-స్పీడ్ కెమెరాలను ఉపయోగిస్తుంది. వ్యూవర్స్‌కి బాల్‌ స్వింగ్, స్పిన్ మూవ్‌మెంట్స్‌ను కూడా హాక్‌ ఐ చూపిస్తుంది. బ్రాడ్‌కాస్టర్‌లు తరచుగా డెలివరీలను అనలైజ్‌ చేయడానికి హాక్-ఐ గ్రాఫిక్స్‌ ఉపయోగిస్తారు.