Thieves Targets EV Charging Stations: ఛండీగఢ్‌లో దొంగలు ఈవీ స్టేషన్‌లపై పడి దోచుకుంటున్నారు. దాదాపు రెండు నెలలుగా ఇదే పనిలో ఉన్నారు. చుట్టూ ఫెన్సింగ్ లేని ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్‌పై దాడి చేసి దొంగిలిస్తున్నారు. ఇప్పటి వరకూ రూ.కోటి విలువైన ఎక్విప్‌మెంట్‌ని ధ్వంసం చేశారు. ఈ చోరీలపై వెంటనే అప్రమత్తమైన అధికారులు పోలీసులను ఆశ్రయించారు. మార్చి 19న వీటిపై పోలీసులు FIR నమోదు చేశారు. రెండు నెలలుగా ఈ చోరీలు జరుగుతున్నా గత వారమే అధికారులు గమనించి అప్రమత్తమయ్యారు. పలు ప్రాంతాల్లోని 9 ఛార్జింగ్ స్టేషన్‌లలోని ఛార్జింగ్ గన్స్, బాక్సులు దొంగిలించారు. ఛండీగఢ్‌లో 53 ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్‌ వీటిని నిర్మిస్తోంది. పార్కింగ్ ఏరియాలతో పాటు ఈ ఛార్జింగ్ స్టేషన్‌లు నిర్మించనుంది. మార్చి 31వ తేదీ నుంచి వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటన్నింటినీ Chandigarh Renewable Energy and Science & Technology Promotion Society (CREST) మెయింటేన్ చేయనుంది. వీటి కాంట్రాక్ట్‌ని కొన్ని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించింది. అయితే...ఈ ప్రాంతాల్లో ఎక్కడా సేఫ్‌టీ లేదు. సీసీ కెమెరాలు లేవు. ఈ ఛార్జింగ్ స్టేషన్‌ల చుట్టూ ఎలాంటి కంచె లేదు. ఫలితంగా సులువుగా చోరీలు జరుగుతున్నాయి. 


ఈ క్రమంలోనే అధికారుల విజ్ఞప్తి మేరకు పోలీస్ ప్యాట్రోలింగ్ వెహికిల్స్ ఆయా ప్రాంతాల్లో నిఘా పెడుతున్నాయి. కేవలం పోలీస్ నిఘాపైనే ఆధారపడకుండా వాటిని కాపాడుకునేందుకు మిగతా ఏం చర్యలు తీసుకోవాలో చూడాలని సూచించారు. గతేడాది సెప్టెంబర్‌లోనే ఛండీగఢ్‌లో ఈవీ పాలసీ తీసుకొచ్చారు. అయితే...సరైన ఛార్జింగ్ వసతులు కల్పించకుండా పాలసీ తీసుకొచ్చి ఏం లాభం అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 7 వేల విద్యుత్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. ఈవీ పాలసీలో భాగంగా నగరవ్యాప్తంగా 177 ఛార్జింగ్ గన్స్‌ని అందుబాటులోకి తీసుకురానున్నారు.