Soldier Mykhailo Dianov: ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో ఇప్పటివరకు ఎన్నో విషాదభరితమైన, హృదయ విదారకమైన దృశ్యాలు ప్రపంచం చూసింది. యుద్ధం మొదలై ఏడు నెలలు పూర్తయినా ఇప్పటికీ తూటాలు పేలుతూనే ఉన్నాయి. బాంబుల మోతలు మోగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఓ షాకింగ్ ఫొటో అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.
షాకింగ్ ఫోటో
రష్యా చెర నుంచి విడుదలైన తమ సైనికుల దుస్థితిని తాజాగా ఉక్రెయిన్ వెల్లడించింది. తీవ్ర గాయాలపాలై, అనారోగ్యంతో కుంగిపోయినప్పటికీ, రష్యా చెర నుంచి బతికి బయటపడ్డాడంటూ మైఖైలో దియనోవ్ అనే సైనికుడి చిత్రాలను షేర్ చేసింది.
అతడి మునుపటి, ప్రస్తుత చిత్రాలను కలిపి ట్విట్టర్‌లో షేర్ చేసింది ఉక్రెయిన్. ఇవి చూసిన ప్రతి ఒక్కరూ నిర్ఘాంతపోతున్నారు.
మేరియుపొల్‌లోని అజోవ్‌స్తల్ స్టీల్ ప్లాంట్‌ను రక్షించుకునేందుకు పోరాటం చేస్తూ దియనోవ్.. రష్యా సైనికులకు చిక్కాడు. అయితే ఖైదీల మార్పిడి ఒప్పందంలో భాగంగా ఇటీవల ఉక్రెయిన్‌కు రష్యా.. 205 మంది సైనికులను అప్పజెప్పింది. అందులో దియనోవ్ కూడా ఉన్నాడు.
ఇలా అయిపోయాడు!
రష్యా చేతికి చిక్కక ముందు ఎంతో బలంగా, కండలు తిరిగిన శరీరంతో ఉన్నాడు దియనోవ్. రష్యా చెర నుంచి విడుదలైన తర్వాత అతడు చాలా బలహీనంగా కన్పిస్తున్నాడు. ముఖం, చేతులపై గాయాల గుర్తులున్నాయి. ప్రస్తుతం కీవ్ మిలిటరీ ఆసుపత్రిలో దియనోవ్ చికిత్స పొందుతున్నాడు.
రష్యా చెరలో అమానవీయ పరిస్థితుల కారణంగా చేతిలో కొంత ఎముకను కోల్పోయాడని వైద్యులు తెలిపారు. తన సోదరుడు బరువు పెరిగే వరకు వైద్యులు పూర్తిస్థాయిలో చికిత్స అందించే పరిస్థితి లేదన్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నా, మానసికంగా బలంగా ఉన్నాడని తెలిపారు. దియనోవ్ పరిస్థితి చూసిన తన సోదరి వెక్కివెక్కి ఏడుస్తోంది. కానీ రష్యా చెర తన సోదరుడు బతికి బయటపడినందుకు సంతోషంగా ఉన్నట్లు చెప్పింది.
Also Read: Rajasthan Congress Crisis: గహ్లోత్‌కు షాకిచ్చి దారిలోకి తెచ్చుకున్న అధిష్ఠానం- అధ్యక్ష రేసులో ఆయనే!