Rajasthan Congress Crisis: రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం వేగంగా పావులు కదుపుతోంది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌ను దారిలోకి తెచ్చుకునేందుకు ఆయన వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అధిష్ఠానం కొరడా ఝళిపించింది. 


ఆ ముగ్గురే


గహ్లోత్ వర్గీయులైన ఇద్దరు మంత్రులు శాంతి ధావల్‌, ప్రతాప్‌ సింగ్‌ ఖచరియావాస్‌, చీఫ్‌ విప్‌లు మొత్తం ముగ్గురికి షోకాజ్ నోటీసులు పంపింది అధిష్ఠానం. ఈ ముగ్గురే కథంతా నడిపారని వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పరిశీలకులుగా వచ్చిన మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్ అధిష్టానానికి సూచించారు. దీంతో ఆ రాష్ట్ర చీఫ్‌ విప్‌తో పాటు ఆ ఇద్దరు మంత్రులకు అధిష్ఠానం షోకాజ్‌ నోటీసు జారీ చేసింది.


తిరుగుబాటుదారులపై చర్య తీసుకోవాలని, పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని అరికట్టాలని పరిశీలకుల సూచన మీదటే కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఎన్నిక వరకూ గహ్లోత్‌నే సీఎం పదవిలో కొనసాగించవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు.


ఆయనే రేసులో


మరోవైపు ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌పై మాత్రం కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గహ్లోత్‌పై కాంగ్రెస్‌ అధిష్టానం వేచిచూసే ధోరణి అవలంబింస్తోంది. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి గహ్లోత్‌ను తప్పించాలని కొంతమంది సీనియర్లు డిమాండ్ చేసినప్పటికీ అధిష్ఠానం మాత్రం ఆయనకు మరో అవకాశం ఇచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో రాజస్థాన్‌లో ప్రస్తుత పరిణామాల వెనుక గహ్లోత్ ప్రమేయం ఏమీ లేదని కాంగ్రెస్‌ పరిశీలకులు తేల్చేసి ఆయనకు క్లీన్‌చిట్‌ ఇచ్చారు. 


అంతకుముందు


మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్ సోమవారం దిల్లీలో సోనియా గాంధీని కలిశారు. రాజస్థాన్‌లో నెలకొన్న సంక్షోభం గురించి ఆమెకు తెలియజేసారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ వైఖరి పట్ల కాంగ్రెస్ అధినేత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు ఏబీపీ న్యూస్‌కి తెలిపాయి.


"అశోక్ గహ్లోత్ ఇలా చేశారా? గహ్లోత్ నుంచి ఇది ఊహించలేదు" అని సోనియా గాంధీ సమావేశంలో రాజస్థాన్ ఇంచార్జ్ అజయ్ మాకెన్, ఖర్గేలకు చెప్పినట్లు సమాచారం. రాజస్థాన్‌లో నెలకొన్న సంక్షోభంపై మంగళవారంలోగా లిఖితపూర్వక నివేదిక ఇవ్వాలని సోనియా గాంధీ కోరారు.


" నేను కాంగ్రెస్ అధినేత్రికి మొత్తం వివరించాను. ఆమె వివరణాత్మక నివేదికను కోరారు. నేను ఆమెకు నివేదిక అందజేస్తాను                             "




-అజయ్ మాకెన్, కాంగ్రెస్ సీనియర్ నేత 

 

గహ్లోత్ బెట్టు

 

అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉండగా గహ్లోత్ తీరుతో అధిష్ఠానం చిక్కుల్లో పడింది.  గహ్లోత్‌ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే రాజస్థాన్ సీఎంగా సచిన్ పైలట్ వద్దని, గహ్లోత్ వర్గీయుడే ఉండాలని ముఖ్యమంత్రికి మద్దతుగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఇప్పటికే 90 మంది వరకు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి స్పీకర్ సీపీ జోషికి అప్పగించారు. 


ఒక వ్యక్తికి ఒకే పదవి ఫార్ములా ఫాలో కావాలని గహ్లోత్‌కు అధిష్ఠానం సూచించింది. దీంతో కనీసం స్పీకర్ సీపీ జోషిని సీఎం చేయాలని గహ్లోత్ అడిగారట. తన రాజకీయ ప్రత్యర్ధి సచిన్ పైలట్‌ను మాత్రం సీఎం చేయడానికి వీల్లేదని గహ్లోత్ చెప్పినట్లు సమాచారం. కానీ అధిష్ఠానం సచిన్ పైలట్‌ను సీఎంగా చేయాలని యోచిస్తుందని తెలుసుకున్న గహ్లోత్ తన వర్గం ఎమ్మెల్యేలను తన వైపే ఉండేలా చూసుకున్నారు.


Also Read: Lakhimpur Road Accident: యూపీలో ఘోర ప్రమాదం, ప్రైవేట్ బస్, ట్రక్ ఢీ - 8 మంది మృతి


Also Read: Ban On PFI: దేశంలో ఇక PFI సంస్థపై నిషేధం, కేంద్రం ఉత్తర్వులు - తక్షణమే అమల్లోకి