భారత్‌లో పాపులర్​ ఫ్రంట్ ఆఫ్​​ ఇండియా సంస్థపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. పీఎఫ్ఐ సహా దాని అనుబంధ సంస్థలను ఐదేళ్ల పాటు బ్యాన్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఆ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. పీఎఫ్ఐ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నందుకే ఆ సంస్థపై ఈ నిషేధం విధిస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో కారణంగా పేర్కొన్నారు.


గత కొద్ది రోజుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పీఎఫ్ఐ సంస్థ కార్యకలాపాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు సహా దేశ వ్యాప్తంగా పీఎఫ్ఐ సంస్థ కార్యాలయాలు సహా సభ్యుల ఇళ్లపై వరుస సోదాలు నిర్వహించింది. ఇప్పటికే ఎన్ఐఏ పలువురు పీఎఫ్ఐ లీడర్లను అరెస్టు కూడా చేసింది.


దేశవ్యాప్తంగా సోదాలు
ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ చోట్ల సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్ఫోఫోర్స్‌మెంట్​ డైరక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది. ఈ రెండు దర్యాప్తు సంస్థలు కలిసి మంగళవారం ఉదయం సంయుక్త ఆపరేషన్​ మొదలుపెట్టాయి.


దేశంలో మొత్తం 8 రాష్ట్రాల్లో PFI సంస్థతో సంబంధం ఉన్న అనేక మంది వ్యక్తులు, సంస్థ ఆఫీసుల్లో సోదాలు కొనసాగుతున్నాయి. యూపీ, మధ్యప్రదేశ్, కేరళ, పంజాబ్, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్, అసోంలో ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్ లో ఇంటలిజెన్స్ బ్యూరోతో పాటు సోదాలు జరుగుతున్న రాష్ట్రాల పోలీసులు కూడా సాయం చేస్తున్నారు.


గత రెండు వారాలుగా పీఎఫ్ఐ కార్యకలాపాలు ఉన్న చోట్ల NIA సోదాలు చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 22న దేశవ్యాప్తంగా ఎన్​ఐఏ విస్తృత సోదాలు నిర్వహించింది. దేశంలో తీవ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలపై 11 రాష్ట్రాల్లోని 106 మంది పీఎఫ్​ఐ నేతలను అరెస్టు చేసింది. కేరళలో ఎక్కువగా అరెస్టులు జరిగాయి. అక్కడ దాదాపు 22 మందిని అరెస్టు చేశారు. మహారాష్ట్ర, కర్ణాటకలో 20 మంది, తమిళనాడులో 10, అసోంలో 9, యూపీలో ఎనిమిది మంది, ఏపీలో ఐదుగురు, మధ్యప్రదేశ్ లో నలుగురు, పుదుచ్చెరి, ఢిల్లీల్లో ముగ్గురు చొప్పున, రాజస్థాన్ లో ఇద్దరు అరెస్టు అయ్యారు.


కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లాలో ఏడుగురు పీఎఫ్ఐ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఐఏ సోదాలకు వ్యతిరేకంగా వీరిలో కొందరు నిరసనలు చేశారు. పీఎఫ్ఐ బాగల్ కోట్ జిల్లా ప్రెసిడెంట్ అస్గర్ అలీ షేక్ కూడా అరెస్టు అయ్యారు. ఇంకా కలబురిగి, రాయచూర్, కోలార్, రామనగర, విజయపుర, బెళగావి, హుబ్బళ్లి - ధార్వాడ్, హాసన్ ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహించిన పీఎఫ్ఐ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. 


పీఎఫ్​ఐ అంటే ఏంటి? అది ప్రమాదమా?
పీఎఫ్ఐ అంటే పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. అణగారిన వర్గాల సాధికారతే తమ లక్ష్యం అని చెప్పుకుంటూ కేరళ కేంద్రంగా 2006లో ఇది ఏర్పాటు అయింది. ఇప్పుడు ఢిల్లీలో హెడ్ ఆఫీసు ఉంది. అణగారిన వర్గాల కోసం పని చేస్తున్నామని పీఎఫ్ఐ చెప్పుకుంటున్నా.. ఎన్ఐఏ, ఐబీ లాంటి కేంద్ర భద్రతా సంస్థలు మాత్రం మరోలా చెబుతుంటాయి. అతివాద ఇస్లాంను పీఎఫ్​ఐ ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తున్నాయి. 


పీఎఫ్​ఐపై ఇలా కేసులు నమోదు కావడం ఇదేం కొత్త కాదు. 2020లో పౌరసత్వ సవరణ చట్టం ఆందోళనల సమయంలో చాలా కేసులు పీఎఫ్ఐపై నమోదయ్యాయి. పౌరసత్వ చట్టం వ్యతిరేక నిరసనలు, 2020 ఢిల్లీ అల్లర్లు, యూపీ హాథ్రాసో దళిత బాలికపై గ్యాంగ్ రేప్ వ్యవహారంలో కుట్ర లాంటి ఇంకా వేర్వేరు సందర్భాల్లో పీఎఫ్​ఐ ఆర్థికంగా మద్దతు ఇచ్చిందని ఆరోపణలు ఉన్నాయి.