తిరుపతి, తిరుమలలో ఏపి‌ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి రెండు‌ రోజుల‌ పర్యటనలో‌ భాగంగా ముందుగా తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ తల్లి వారిని దర్శించుకుని‌ ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ పాలక మండలి సభ్యులు సీఎం జగన్మోహన్ రెడ్డిని పట్టు వస్త్రంతో సత్కరించి అమ్మవారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. 


సాయంత్రం 6.40 గంటలకు శ్రీవారి పాదాల చెంత అలిపిరి వద్ద ఆర్టీసీ పర్యావరణ హిత విద్యుత్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈవే ట్రాన్స్ లిమిటెడ్ సంస్థ సరఫరా చేసిన ఈ -బస్ ను ఆర్టీసీ ఇప్పటికే విజయవంతంగా ట్రయన్ రన్ నిర్వహించింది. ఈ రోజు 9 ఈ - బస్సులను తిరుపతికి తీసుకు వచ్చింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలుత 10 ఈ-బస్సులను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభించారు. దశల వారీగా ఈ ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను 100కు పెంచనుంది ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ.


త్వరలోనే 100 బస్సులకు పెంపు..


అలిపిరి బస్ డిపో కేంద్రంగా ప్రజా రవాణా సంస్థ ఈ బస్సులను నడపనుంది. ఎలక్ట్రిక్ బస్సులు నడిపే కాంట్రాక్టు దక్కించుకున్న ఈవే ట్రాన్స్ లిమిటెడ్ కంపెనీ వీటిని 12ఏళ్ల పాటు నిర్వహించనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. 50 బస్సులను తిరుమల - తిరుపతి ఘాట్ రోడ్డు సర్వీసుల కోసం కేటాయించనున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమల కొండపైకి మరో 14 ఎలక్ట్రికల్ బస్సులు నడుపుతారు. మరో 12 బస్సులను తిరుపతి నుంచి మదనపల్లికి, అలాగే.. తిరుపతి నుంచి కడపకు, నెల్లూరుకు 12సర్వీసులు చొప్పున నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. 


కిలోమీటరుకు కేవలం రూ.7.70 మాత్రమే


ఎలక్ట్రికల్ బస్సుల వల్ల కర్బన ఉద్గారాలు వెలువడవని ఉన్నత అధికారులు చెబుతున్నారు. దీని వల్ల కాలుష్యాన్ని పెద్ద ఎత్తున నియంత్రించవచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ-బస్సుల నుంచి జీరో స్థాయిలో కర్బన ఉద్గారాలు వెలువడుతాయి. అంటే ఈ-బస్సుల నుంచి ఎలాంటి కర్బన ఉద్గారాలు వెలువడవు. 100 ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఏటా 5 వేల మెట్రిక్ టన్నులకుపైగా కర్బన ఉద్గారాలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.


కాలుష్యాన్ని నియంత్రించడంతోపాటు ఎలక్ట్రికల్ బస్సుల వాడకం వల్ల కిలోమీటరుకు అయ్చే ఖర్చు భారీగా తగ్గుతుంది. ఏసీ ఇంద్ర బస్సుకు కిలోమీటరుకు రూ.28.75 ఇంధన వ్యయం అవుతుండగా.. అదే ఎలక్ట్రికల్ బస్సు వల్ల కిలోమీటరుకు కేవలం రూ.7.70 ఖర్చే అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో ఈ వ్యయం మరింత తగ్గే అవకాశం ఉంటుందని వెల్లడిస్తున్నారు.


రానున్న రోజుల్లో ఈవీ బ్యాటరీల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ బ్యాటరీల సాంకేతికత మెరుగు పడటంతోపాటు వాటి ధరలు దిగి వస్తాయి. దీని వల్ల రవాణా వ్యయం తగ్గుతుంది.


తిరుమల కొండపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా సంస్కరణలు అమలు చేస్తూ వస్తోంది. ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించింది. ఇప్పుడు అదే బాటలో ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభించింది. తిరుమల-తిరుపతిని కేంద్రంగా చేసుకుని తొలిసారిగా ఎలక్ట్రికల్ బస్సు(ఈ- బస్సు)లను ప్రవేశ పెట్టింది.