తిరుపతి :  చంద్రగిరి నేషనల్ హైవే లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర కారు, ఓ ఇసుక ట్రాక్టర్ ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాకర్ట్ రెండు ముక్కలైంది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగుళూరు నుంచి తిరుపతికి వస్తున్న బెంజ్ కారును ఇసుక లోడ్ తో వెళుతున్న ట్రాక్టర్ అడ్డుగా రావడంతో ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ బోల్తా పడింది. ఆపై ఇంజన్, ట్రాలీ రెండుగా విడిపోయి ట్రాక్టర్ రెండు ముక్కలుగా మారింది. ట్రాక్టర్ డ్రైవర్ మునికి తీవ్ర గాయాలయ్యాయి. బెంజ్ కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన డ్రైవర్ ను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.


కారు తుక్కుతుక్కు అవుతుంది.. కానీ సీన్ రివర్స్ 
సాధారణంగా అయితే ఏదైన కారు వేగంగా దూసుకొచ్చి ట్రాక్టర్‌ను గుద్దినా, లేక ట్రాక్టర్ వచ్చి కారును ఢీకొట్టినా చిన్న వాహనం అయిన కారు తుక్కుతుక్కు అవుతుంది. కానీ, తిరుపతి జిల్లాలో సీన్ రివర్స్ అయింది. యూటర్న్ తీసుకుంటున్న ట్రాక్టర్ ను కారు వేగంగా వచ్చి ఢీకొట్టగా.. ట్రాక్టర్ రెండు ముక్కలైంది. ఎందుకంటే అది బెంజ్ కారు. ట్రాక్టర్ రాంగ్ రూట్‌లో రావడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అయితే కారు సైతం అతివేగంగా దూసుకురావడం కూడా మరో కారణమని చెప్పవచ్చు.






తిరుపతి సమీపంలో రేణిగుంట-చిత్తూరు బైపాస్ రోడ్డు మీద చంద్రగిరి నేషనల్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. కర్ణాటక రిజిస్ట్రేషన్ తో ఉన్న కారు నెంబర్ కేఏ 04 ఎంయూ 3456 బెంజ్ కారు బెంగళూరు నుంచి తిరుపతికి వేగంగా వస్తోంది. ఆ సమయంలో ఒక ట్రాక్టర్ ( 39 టీఎల్ 8463) రాంగ్ రూట్ లో వస్తోంది. ట్రాక్టర్ యూటర్న్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో బెంజ్ కారు ట్రాక్టర్ వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. బెంజ్ కారు వేగంతో పాటు దాని క్వాలిటీకి ఆ ట్రాక్టర్ ఇంజిన్, ట్రాలీలుగా విడిపోయి రెండు ముక్కలైంది. ఇది తెలిసిన స్థానికులు చూసేందుకు భారీ సంఖ్యలో చంద్రగిరి హైవే వద్దకు వచ్చారు.






రోడ్డు ప్రమాదంతో ట్రాఫిక్ సమస్య..
కారు, ట్రాక్టర్ ఢీకొనడంతో ట్రాక్టర్ రెండు ముక్కలై రోడ్డుపై పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు, టీమ్ అక్కడికి చేరుకుని ట్రాక్టర్ భాగాలను రోడ్డు పక్కకు తొలగించడంతో వాహన రాకపోకలు యథావిధిగా సాగాయి. అతివేగంతో ప్రమాదాలు జరిగి, ప్రాణాలు పోతాయని.. ట్రాఫిక్ రూల్స్ ఏ ఒక్క వాహనం పాటించకపోయినా ఇలాంటి ఘటనలు జరుగుతాయని వాహనదారులను పోలీసులు హెచ్చరించారు.