గల్ఫ్ దేశాలు హైఅలర్ట్‌లో ఉన్నాయి. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబిపై డ్రోన్ దాడులు కలకలం సృష్టించగా ఈరోజు మరో దాడి జరిగింది. అయితే ఈసారి ఏకంగా బాలిస్టిక్ క్షిపణులతో దాడికి యత్నించారు. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడి ప్రయత్నాన్ని విజయవంతంగా అడ్డుకున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తెలిపింది.


ప్రాణనష్టం లేదు..


అబుదాబి లక్ష్యంగా ఈ క్షిపణి దాడి జరిగిందని డబ్ల్యూఏఎం న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. ఓ వైపు నుంచి క్షిపణులు దూసుకురాగా వాటిని దారిలోనే అడ్డుకునేందుకు మరోవైపు నుంచి మిసైళ్లు ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఈ దాడికి సంబంధించినట్లుగా చెబుతోన్న పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 










తాము ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని యూఏఈ పేర్కొంది. ఈ దాడికి ఇంతవరకు ఎవరూ బాధ్యత వహించలేదు. అయితే అబుదాబి విమానాశ్రయంలో ఇటీవల డ్రోన్ దాడులకు పాల్పడ్డ హౌతీ తీవ్రవాదులే ఈ క్షిపణులను ప్రయోగించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


డ్రోన్ దాడులు..


అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా ఇటీవల జరిగిన దాడిలో ముగ్గురు మరణించారు. మృతుల్లో ఇద్దరు భారతీయులు ఉన్నారు. యెమన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటు సంస్థ డ్రోన్‌ దాడులు చేసినట్లు ఒప్పుకుంది.


యూఏఈపై దాడులు చేసినట్లు హౌతీ సంస్థ ప్రకటించింది. యెమన్‌లో ఇరాన్‌ అనుకూల హౌతీ తిరుగుబాటుదారులతో సౌదీ నేతృత్వంలో 2015 నుంచి యూఏఈ యుద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో సౌదీతో పాటు యూఏఈని కూడా హౌతీ సంస్థ లక్ష్యంగా చేసుకుంది. ఈ వరుస దాడులతో యూఏఈలో టెన్షన్ వాతావరణం నెలకొంది.


Also Read: Watch Video: ఎముకలు కొరికే చలిలో 40 సెకన్లలో 47 పుష్అప్స్.. సాహో సైనిక.. వీడియో వైరల్



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి