CM Uddhav on BJP: 'భాజపాతో స్నేహం చేసి 25 ఏళ్లు వేస్ట్ చేశాం.. ఇక గల్లీ రాజకీయాలు కాదు దిల్లీయే లక్ష్యం'

ABP Desam   |  Murali Krishna   |  28 Jan 2022 02:35 PM (IST)

దిల్లీని శాసించే స్థాయిలో శివసేన పార్టీ ఎదగాలని, అందుకోసమే తాము ప్రయత్నాలు చేస్తున్నామని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. 25 ఏళ్ల పాటు భాజపాతో కలిసి పని చేసి సమయాన్ని వృథా చేశామన్నారు ఠాక్రే.

ఉద్ధవ్ ఠాక్రే

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు. 25 ఏళ్ల పాటు భాజపాతో జట్టు కట్టి శివసేన తప్పు చేసిందన్నారు. మహారాష్ట్ర బయట కూడా పార్టీని విస్తరించే ఆలోచనలో శివసేన ఉన్నట్లు స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాలపై శివసేన దృష్టి పెట్టిందని ఉద్ధవ్ అన్నారు.

మరోవైపు భాజపా.. రాజకీయ లబ్ధి కోసం హిందుత్వ అజెండాను వాడుకుంటోందని ఆరోపించారు. తన తండ్రి, శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే 96వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ వర్చువల్ ర్యాలీలో ఠాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు.

శివసేన.. భాజపాతో కలిసి ప్రయాణం చేసింది.. హిందుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికే. కానీ ఏనాడు హిందుత్వ అజెండాను అధికారంలో కోసం శివసేన వాడుకోలేదు. ఇప్పుడు కూడా శివసేన.. భాజపాను మాత్రమే వదిలేసింది.. హిందుత్వాన్ని కాదు. 25 ఏళ్లు భాజపాతో కలిసి పని చేసి శివసేన సమయాన్ని వృథా చేసింది.                                                                 -   ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి

భాజపా నేతృత్వంలో ఉన్న నేషనల్ డెమోక్రటిక్ అలైన్స్ (ఎన్‌డీఏ) నుంచి శివసేన 2019లో బయటకు వచ్చింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎన్‌సీపీ, కాంగ్రెస్‌తో ఉమ్మడి సర్కార్‌ను మహరాష్ట్రలో ఏర్పాటు చేసింది శివసేన. మహా వికాస్ అగాఢీ (ఎమ్‌వీఏ) అని దీనికి పేరు పెట్టారు. 

భాజపా తన జాతీయ స్థాయి లక్ష్యాలను చేరుకోవాలని శివసేన.. మనస్ఫూర్తిగా మద్దతిచ్చింది. జాతీయ స్థాయిలో భాజపా అధికారంలో ఉంటే మహారాష్ట్రను శివసేన పాలించాలని మా మధ్య ఒప్పందం కుదిరింది. కానీ భాజపా మమ్మల్ని మోసం చేసింది. మా రాష్ట్రంలోనే మమ్మల్ని బలహీనం చేయాలని ప్రయత్నించింది. అందుకే మేం తిరిగి దెబ్బ తీశాం.                                                                          - ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర సీఎం

వాడుకుని వదిలేస్తుంది..

రాజకీయ అవసరాల కోసం మిత్రపక్షాలను వాడుకొని తర్వాత వదిలేయడం భాజపాకు అలవాటని ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. హిందుత్వ అజెండాను శివసేన వదిలేసిందని భాజపా చేస్తోన్న ఆరోపణలను ఆయన ఖండించారు. తాము వదిలేసింది భాజపాను మాత్రమేనని హిందూత్వ భావజాలాన్ని కాదని ఉద్ధవ్ అన్నారు. దిల్లీని శాసించే స్థాయిలో కేంద్రంలో అధికారం సాధించడమే శివసేన లక్ష్యమని ఉద్ధవ్ అన్నారు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

 

Published at: 24 Jan 2022 12:04 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.