Bengaluru Water Crisis Updates: బెంగళూరులో నీటి కొరతే (Bengaluru Water Crisis) లేదని కర్ణాటక డిప్యుటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా సరైన సమయానికి అందరికీ నీళ్లు పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. ట్యాంకర్‌ల ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నట్టు వివరించారు. ఉన్న నీటి వనరులను గుర్తించామని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం నీటి వినియోగంపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒక్క చుక్క నీరు కూడా వృథా కాకుండా జాగ్రత్త పడుతోంది. నీటిని వృథా చేస్తే జరిమానా విధిస్తామని తేల్చి చెప్పింది. కార్‌ వాషింగ్‌, గార్డెనింగ్‌ కోసం తాగునీటిని వినియోగించకూడదని మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటికే సిటీలోని బోర్‌వెల్స్ అన్నీ ఎండిపోయాయి. భూగర్భజలాలు అడుగంటిపోయాయి. రోజువారీ అవసరాల కోసం ప్రైవేట్ ట్యాంకర్‌లనే నమ్ముకోవాల్సి వస్తోంది. మామూలు రోజులతో పోల్చి చూస్తే రెట్టింపు వసూలు చేస్తున్నారు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్‌ల ఓనర్లు. 


"బెంగళూరులో నీటి సంక్షోభం అనేదే లేదు. సిటీలో 7 వేల బోర్‌వెల్స్ ఎండిపోయాయి. అయినా ప్రభుత్వం అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉంది. ఎవరికీ సమస్య రాకుండా నీళ్లు పంపిణీ చేస్తోంది. ట్యాంకర్‌లను ఏర్పాటు చేశాం. నీటి వనరులు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాం. అందరికీ నీళ్లు సరఫరా అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటాం"


- డీకే శివకుమార్, కర్ణాటక డిప్యుటీ సీఎం


వాటర్ ట్యాంకర్‌ ఓనర్లు ఇష్టారీతిన డబ్బులు వసూలు చేయడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. 200 ప్రైవేట్ ట్యాంకర్‌లని ఎంపిక చేసి నాలుగు నెలల పాటు ప్రభుత్వం చెప్పిన ధరలకే నీటి పంపిణీ చేయాలని తేల్చి చెప్పింది. అయితే..బీజేపీ ఇటీవలే పలు ఆరోపణలు చేసింది. కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకి తలొగ్గి నీళ్లని పంపిణీ చేస్తోందని మండి పడింది. ఈ ఆరోపణలపై డీకే శివకుమార్ స్పందించారు. కావేరీ నదీ జలాలను నిబంధనలకు అనుగుణంగానే సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. బీజేపీ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ తమిళనాడుకి నీళ్లు పంపిణీ చేసే అవకాశమే లేదని వెల్లడించారు. రామనగర జిల్లాలో కనకపుర వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ "Mekedatu" ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపట్టారు. ఇది పూర్తైతే బెంగళూరు ప్రజల నీటి కష్టాలు తీరిపోతాయి. ఇందుకోసం రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంతే కాదు. 400MW విద్యుత్‌నీ ఉత్పత్తి చేసేందుకు వీలవుతుంది. ప్రస్తుతం నగరవ్యాప్తంగా నీటికి తీవ్ర కొరత కనిపిస్తోంది. అపార్ట్‌మెంట్‌ల బయట అందరూ వాటర్ ట్యాంకర్‌ల వద్ద బకెట్‌లు, బిందెలు పట్టుకుని నిలబడుతున్నారు. కొన్ని చోట్ల అయితే బకెట్‌ నీళ్లకి రూ.50 చెల్లిస్తున్నారు. 


"బీజేపీ వాళ్లు నీటి విషయంలోనూ రాజకీయాలు చేస్తున్నారు. వాళ్లు ఏం చేస్తారో చేయనివ్వండి. కేవలం నీళ్ల కోసమే నేను పాదయాత్ర చేశాను. మేకేదతు ప్రాజెక్ట్‌ పూర్తైందా లేదా చూడడానికే వెళ్లాలనుకున్నాను. కానీ అందుకు అనుమతినివ్వడం లేదు. ప్రాజెక్ట్‌ని చూసేందుకు ప్రధాని మోదీ నాకు అనుమతినివ్వాలని కోరుకుంటున్నాను"


- డీకే శివకుమార్, కర్ణాటక డిప్యుటీ సీఎం


Also Read: One Nation One Election: జమిలి ఎన్నికలపై నివేదిక, రాష్ట్రపతికి అందించిన రామ్‌నాథ్ కోవింద్ కమిటీ