One Nation One Election Report: ఒకే దేశం ఒకే ఎన్నికపై రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఓ రిపోర్ట్ తయారు చేసింది. ఈ నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సమర్పించారు. రామ్‌నాథ్ కోవింద్‌తో సహా కమిటీ సభ్యులు ఆమెని కలిసి ఈ నివేదికని అందజేశారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక అంశాల్ని ఇందులో పొందుపరిచారు. జమిలి ఎన్నికలు నిర్వహణపై కమిటీ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ కమిటీ ప్రతిపాదించింది. మొత్తం 18,626 పేజీల ఈ రిపోర్ట్‌ని ఎంతో మంది నిపుణుల అభిప్రాయాలు సేకరించి తయారు చేశారు. దాదాపు 191 రోజుల పాటు కసరత్తు చేశారు. గతేడాది సెప్టెంబర్ 2వ తేదీన కేంద్రం కోవింత్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. 


"పార్టీల సలహాలు, నిపుణుల అభిప్రాయాలు సేకరించాం. ఎంతో మేధోమథనం చేసిన తరవాత కమిటీ సభ్యులంతా జమిలి ఎన్నికల నిర్వహణను ప్రతిపాదించింది. ఏకగ్రీవంగా ఇందుకు ఆమోదం తెలిపింది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికల ప్రక్రియలో భారీ మార్పులు వస్తాయి"


- నివేదిక 






జమిలి ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగంలో Article 324A ని చేర్చాలని కమిటీ ప్రతిపాదించింది. ఈ అధికరణని చేర్చడం ద్వారా పంచాయతీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు వీలవుతుందని వెల్లడించింది. లోక్‌సభ,అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని సూచించింది. మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలు పూర్తైన 100 రోజుల్లోగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించింది. రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, ఫైనాన్స్ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే ఉన్నారు. హంగ్‌ వచ్చినప్పుడు లేదా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడూ ఎన్నికలు నిర్వహించాలని కమిటీ ప్రతిపాదించింది. ఎన్నేళ్లు మిగిలి ఉంటే అన్నేళ్ల పాటు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్నికలు ప్పకుండా నిర్వహించాలని తేల్చి చెప్పింది. ఓటర్ల హక్కులను కాపాడేందుకు వీలుగా లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక ఎన్నికలకు ఒకటే ఫొటో ఐడెంటిటీ కార్డ్‌ ఉండాల్సిన ప్రాధాన్యతని వివరించింది. కొద్ది రోజులుగా ఈ కోవింద్ కమిటీ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతోంది. రాజ్యాంగ నిపుణులతో పాటు మాజీ ఎన్నికల సంఘ కమిషనర్లు, ఎన్నికల సంఘంతో చర్చలు నిర్వహించింది. జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అభిప్రాయాలు సేకరించింది. 


Also Read: Election Commissioners: కేంద్ర ఎన్నికల కమిషనర్లు నియామకం, ఇద్దరిని ఎంపిక చేసిన కమిటీ