Actress Rachna Banerjee: ఇప్పటికే ఎన్నో భాషల నుండి వచ్చి తెలుగులో హీరోయిన్లుగా సెటిల్ అయిపోయిన భామలు ఎంతోమంది ఉన్నారు. అలాగే ఒకప్పుడు బెంగాలీ నుండి వచ్చి తెలుగులో పలువురు స్టార్ హీరోలతో నటించారు మమతా బెనర్జీ. ఇక చాలాకాలం తర్వాత తెలుగు ప్రేక్షకులకు హలో చెప్పడానికి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్ గురించి కూడా పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు రచనా.


ఆయనే నాకు మెంటర్..


బెంగాలీ అమ్మాయి కావడంతో తెలుగులో డైలాగులు చెప్పడం కష్టంగా ఉండేదని అయినా టాలీవుడ్‌లో నటించడం చాలా సంతోషంగా అనిపించిందని చెప్పుకొచ్చారు రచనా బెనర్జీ. తెలుగులో ఎక్కువగా ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్‌లో హీరోయిన్‌గా నటించారు రచనా. ఆయన వల్లే తెలుగులోకి అడుగుపెట్టానని, తనకు ఒక మెంటర్ లాంటివారని తెలిపారు. ఆయన స్క్రిప్ట్స్‌లో కామెడీ చాలా బాగుండేదని ప్రశంసించారు. ఇప్పట్లో ఆర్టిస్టులకు రెమ్యునరేషన్ చాలా భారీగా ఉంటుందని కానీ అప్పట్లో లక్షల్లో రెమ్యునరేషన్ మాత్రమే వారికి సరిపోయేదని గుర్తుచేసుకున్నారు. తెలుగు ఆహారం అంటే కూడా తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు రచనా. ఒకప్పుడు తనకు ఏ సినిమా అవకాశం వచ్చినా ఒప్పుకున్నానని, అవే ఆఫర్లు ఇప్పుడు వస్తే కొన్నింటిని రిజెక్ట్ చేసేదాన్ని అని అన్నారు.


నా సొంత నిర్ణయం..


తెలుగులో తన కెరీర్ ఎప్పుడూ సక్సెస్‌ఫుల్‌గానే కొనసాగిందని, పెళ్లి అయిన తర్వాత సినిమాలు ఆపేయాలి అన్నది తన సొంత నిర్ణయమని క్లారిటీ ఇచ్చారు రచనా బెనర్జీ. తర్వాత తన కమ్ బ్యాక్ ఇవ్వాలి అనుకున్నది కూడా పూర్తిగా తన సొంత నిర్ణయమే అని తెలిపారు. తన కొడుకు సినిమాలకు దూరమని, క్రికెట్ అంటే ఇష్టమని బయటపెట్టారు. ఇక బయట మారుతున్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఒకప్పుడు మహిళలు.. పురుషులపై ఎక్కువగా ఆధారపడి ఉండేవారు కాబట్టి పెళ్లి ముఖ్యమని అనుకునేవారని, ఈరోజుల్లో పెళ్లి అనేది అంత ముఖ్యం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకవేళ పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి అంటే అది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు.


అందరినీ పెళ్లి అయిపోయింది..


తను హీరోయిన్‌గా నటిస్తున్నప్పుడు ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చారు రచనా బెనర్జీ. అప్పట్లో తను పనిచేసిన హీరోలు అందరికీ పెళ్లి అయిపోయి, పిల్లలు కూడా పుట్టేశారని గుర్తుచేసుకున్నారు. కేవలం జేడీ చక్రవర్తికి మాత్రమే అప్పట్లో పెళ్లి కాలేదని, కానీ తను మాత్రం ప్రపోజ్ చేయలేదని చెప్పి నవ్వేశారు. ఎందుకు ప్రపోజ్ చేయలేదో ఆయననే అడగాలని సరదాగా మాట్లాడారు. అప్పట్లో తెలుగు స్టార్లకు ఎక్కువగా హిందీ రాదని, తనకు తెలుగు రాదని.. దాని వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉండేదని తెలిపారు రచనా.


ఇప్పటికీ మంచి ఫ్రెండ్స్..


హీరోయిన్‌గా, బుల్లితెర హోస్ట్‌గా రచనా చాలామందికి తెలుసు. కానీ తన పర్సనల్ లైఫ్ గురించి చాలామందికి తెలియదు. ముందుగా సిద్దాంత్ మొహపాత్ర అనే హీరోను పెళ్లి చేసుకొని విడిపోయారు రచనా. ఆ తర్వాత ప్రబోల్ బసు అనే బిజినెస్‌మ్యాన్‌ను పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కొడుకు పుట్టిన తర్వాత తనతో కూడా విడాకులు తీసుకున్నారు. అయితే తన మ్యారేజ్ లైఫ్‌కు ఏమైంది అని ప్రశ్నించగా.. వారిద్దరికీ సెట్ అవ్వలేదని, కానీ వారిద్దరూ ఇప్పటికీ మంచి ఫ్రెండ్స్‌గా ఉంటూ.. కష్టాలు షేర్ చేసుకుంటూ, కలిసి ట్రిప్స్‌కు కూడా వెళ్తారని బయటపెట్టారు రచనా. విడివిడిగా ఉంటున్నా కూడా వారి మధ్య ఫ్రెండ్‌షిప్ అలాగే ఉందని తెలిపారు.


Also Read: అరే ఏంట్రా ఇది - పెట్టింది రూ.45 కోట్లు, వచ్చింది రూ.38 వేలు, ఇంతకీ ఆ ఘోరమైన ఫ్లాప్ మూవీ ఏమిటో తెలుసా?