Raveena Tandon About Film Career: రవీనా టాండన్. సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. 1991లో ‘పత్తర్ కే పూల్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తొలి చిత్రానికే ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డును అందుకుంది. ‘క్షత్రియ’, ‘దిల్‌వాలే’, ‘జమానా దివానా’, ‘కీమత్‌ దే ఆర్‌ బ్యాక్‌’, ‘బడే మియా చోటే మియా’, ‘పరదేశీ బాబు’, ‘దావన్‌’ సహా పలు సినిమాలతో మెప్పించింది. దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. తెలుగులోనూ రవీనా పలు సినిమాలు చేసింది. 1993లో బాలకృష్ణ హీరోగా నటించిన ‘బంగారు బుల్లోడు’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘రథసారథి’, ‘ఆకాశవీధిలో’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’ చిత్రాల్లో నటించింది. ‘కేజీఎఫ్‌-2’లో  ప్రధాని రమికా సేన్‌గా కనిపించింది. ఇటీవలే ‘కర్మ కాలింగ్‌’ అనే వెబ్‌ సిరీస్‌ లో రవీనా టాండన్‌ నటించింది.  2023లో సినిమా రంగంలో ఆమె చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది.

  


ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ ఎవరూ లేరు!


రవీనా టాండన్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత, రచయిత రవి టాండన్ కూతురు. 1970, 1980 దశకంలో ఆయన ఎన్నో అద్భుత చిత్రాలను తెరకెక్కించారు. ‘ఖేల్ ఖేల్ మే’, ‘ఝూతా కహిన్ కా’, ‘ఖుద్దార్’ లాంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. అయినప్పటికీ ఆమె తన సొంత టాలెంట్ తోనే ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవీనా టాండన్ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. హిందీ చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడి కుమార్తెను అయినప్పటికీ తనకు ఎవరూ గాడ్ ఫాదర్ లేడని చెప్పుకొచ్చింది. స్వశక్తితోనే సినిమా పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నట్లు చెప్పింది. “నేను హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి అనుకోలేదు. నేను చేసిన సన్‌ సిల్క్ యాడ్ నా కెరీర్ ను పూర్తిగా మలుపు తిప్పింది. ఆ తర్వాత ప్రముఖ ఫోటో గ్రాఫర్ శంతను షియోరే తన ఫోటో షూట్ చేయడం కలిసి వచ్చింది. ఇండస్ట్రీలో మా నాన్న పెద్ద ఫిల్మ్ మేకర్ గా ఉన్నప్పటికీ.. నాకు గాడ్ ఫాదర్ ఎవరూ లేరు. నాకు నేనుగా ఇండస్ట్రీలో రాణించాను. ఇండస్ట్రీలో నేను ఏం సాధించినా, నా సొంతంగానే దక్కింది” అని చెప్పుకొచ్చింది.    


మురికివాడను చూసి మనసు మార్చుకున్నా!


ఒకప్పుడు తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు రవీనా టాండన్ తెలిపింది. “ఒకప్పుడు నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఓ రోజు డ్రైవ్ చేసుకుంటూ ముంబై మురికివాడకు వెళ్లాను. అక్కడ ఉండే వారి పరిస్థితి చూసి చాలా బాధపడ్డాను. వారితో పోల్చితే నేను ఎంతో బెటర్ గా ఉన్నాను అనుకున్నా. ప్రతి ఒక్కరు జీవితంలో ఏదో ఒక సమయంలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటారు. మా నాన్న కూడా చాలా కష్టాలు పడ్డారు. నేను ఒకప్పుడు బస్సులో కేవలం ఒక్క రూపాయితో ప్రయాణించిన సందర్భాలున్నాయి. డబ్బు కోసం చాలా కష్టపడ్డా. ఆ తర్వాత నా కాళ్ల మీద నేను నిలబడ్డాను” అని చెప్పుకొచ్చింది. 


రవీనా టాండన్ ప్రస్తుతం ‘పాట్నా శుక్లా’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో విద్యా కుంభకోణాన్ని బయటపెట్టే లాయర్ గా కనిపించనుంది. ఈ చిత్రం మార్చి 29 నుండి డిస్నీ+ హాట్‌ స్టార్‌ లో విడుదల కానుంది.


Read Also: అంబానీ అంకుల్ మీరూ మా మూవీ చూడాలి - అనంత్ ప్రి-వెడ్డింగ్ వేడుకలో ‘ఓం భీమ్ బుష్’ టీమ్ అల్లరి