History of Eating Meat:


సండే అంటే మాంసం ఉండాల్సిందే..


అందరూ సండే ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. రెస్ట్ తీసుకోవటానికి మాత్రమే కాదు. రుచికరమైన విందు చేసేందుకు కూడా. ఇక ఆదివారం విందు అంటే...మాంసం లేకుండా ఉంటుందా..? చికెన్, మటన్, ఫిష్. వీటిలో ఏదో ఒకటి లాగించేయాల్సిందే. మళ్లీ వీటిలోనూ ఎన్నో వెరైటీలు. మాంసం తినకపోతే...ఆదివారం ఏదో అసంపూర్తిగా గడిచిపోయిందే అనిపిస్తుంది కొందరికి. ముక్క లేనిదే ముద్ద దిగదు అని గట్టిగా చెప్పేస్తారు కూడా. కొందరికైతే...మాంసానికి మసాలా దట్టిస్తుంటేనే...ఆ స్మెల్‌కే సగం కడుపు నిండిపోతుంది. ఇదంతా సరే. అసలు మనిషికి మాంసం తినడం ఎప్పుడు అలవాటైందో ఎప్పుడైనా ఆలోచించారా..? అసలు మాంసం తినాలన్న ఆలోచన ఎప్పుడు పుట్టిందో తెలుసా..? ఆ ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


మాంసం ఎందుకు తినాల్సి వచ్చింది..? 


మానవ పరిణామ క్రమంలో (Human Evolution) మాంసం తినటం అనేది అతి పెద్ద మలుపు అంటారు హిస్టారియన్లు. ఎప్పుడు ఇది మొదలైంది అని కచ్చితంగా చెప్పలేకపోయినా...దొరికిన ఆధారాల ప్రకారం చూస్తే...2.5 మిలియన్ సంవత్సరాల క్రితమే మాంసం ఆరగించటం మొదలైందని తెలుస్తోంది. హ్యూమన్ ఎవల్యూషన్‌లో రెండు కాళ్లతో నడిచిన వాళ్లను "Hominin"గా పిలుచుకుంటారు. అంటే...ప్రస్తుత మనిషి రూపానికి దాదాపు దగ్గరగా ఉంటుంది Hominin శరీరాకృకతి. తూర్పు, మధ్య, దక్షిణాఫ్రికాల్లో వీరి మూలాలున్నాయి. రెండున్నర మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై సంచరించిన Homininలకు 32 పళ్లతో నోరు చాలా పెద్దగా ఉండేది. దవడలూ పెద్దగా ఉండేవి. దవడల మూలల్లో నాలుగు పదునైన పళ్లుండేవి. వేటాడేందుకు, మాంసం తినేందుకు...ఈ పళ్లే ఆయుధాలుగా మారాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. 
అప్పటి వరకూ పండ్లు, ఆకులు, దుంపలు లాంటివి తిన్న మన యాన్‌సిస్టర్స్‌...ఉన్నట్టుండి మాంసం ఎందుకు తిన్నారన్నదే అసలు ప్రశ్న. 


ఆ కరువే కొత్త మార్గం చూపింది..


సరిగ్గా 2.5 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి దారుణంగా వేడెక్కింది. వాతావరణ మార్పుల కారణంగా...అడవుల విస్తీర్ణం తగ్గిపోయింది. పచ్చదనం కనిపించకుండా పోయింది. ఉన్నట్టుండి భూమి ఎడారిగా మారిపోయింది. అప్పటి వరకూ దొరికిన పండ్లు, ఆకులతో కడుపు నింపుకున్న ఆది మానవులకు "ఆకలి" తెలిసొచ్చింది. ఆ ఆకలే కొత్త ఆలోచనకు బీజం వేసింది. మనుగడ సాగించేందుకు కొత్త శక్తి అవసరమని భావించారు వారంతా. గుంపులుగా ఉండటం అప్పుడే నేర్చుకున్న వాళ్లు...ఆహారం కోసం వేటాడటం మొదలు పెట్టారు. జీబ్రాలు, హైనాలు లాంటి జంతువులను వేటాడి వాటి మాంసాన్ని తినేవారు. అయితే...ఇక్కడ మరో వాదన కూడా ఉంది. అప్పటికి వేటాడటం వారికి తెలియలేదని, జంతు కళేబరాల నుంచి మాంసాన్ని వేరు చేసి తినేవాళ్లని ఇంకొందరు చెబుతారు. అలా క్రమంగా...వాళ్ల ఆహార శైలిలో మార్పు వచ్చింది. మాంసం రుచికరంగా ఉందన్న భావనతో...అదే ఎక్కువగా తినేవారు. నియాండర్తల్‌ (Neanderthals)లు తీసుకునే ఆహారంలో 70% మేర మాంసమే ఉండేదని కొన్ని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మంటను ఎక్కువగా వినియోగించింది కూడా వీరేనని చరిత్ర చెబుతోంది. మాంసాన్ని కాల్చి తినటం వీరి నుంచే ప్రారంభమైందని అంటారు. రోజూ మాంసం తినటం వారి జీవనశైలిలో ఓ భాగమైపోయిందని చరిత్రకారులు పలు సందర్భాల్లో చెప్పారు. 




(Image Credits: Quora)


పదునైన ఆయుధాలు..


20 లక్షల సంవత్సరాల క్రితమే మాంసం తినటం మొదలైందని చెప్పటానికి మరి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ఆర్కియాలాజికల్ రికార్డుల ప్రకారం..."Handyman"గా చెప్పుకునే  "Homo Habilis"లు రాళ్లతో తయారు చేసిన పదునైన కత్తులు వినియోగించి మాంసాన్ని కట్ చేసే వాళ్లు. 2 మిలియన్ సంవత్సరాల క్రితమే...ఇలాంటి ఆయుధాలు వాడినట్టు కెన్యాలో చేసిన పరిశోధనల్లో తేలింది. ఈ ప్రాంతంలో తవ్వకాలు జరపగా...రాయితో తయారు చేసిన వేలాది కత్తులు దొరికాయి. అంతే కాదు. జంతువుల ఎముకలతో తయారు చేసిన ఆయుధాలూ లభించాయి. మన పూర్వీకుల దవడలు, పళ్లు మన కన్నా చాలా పెద్దవిగా ఉండేవి. నిజానికి...వాళ్ల నోళ్ల ఆకృతులు కేవలం మొక్కలు, లేదా పండ్లుతినేందుకు మాత్రమే సపోర్ట్ చేసేవి. కానీ...కరవు కారణంగా...మాంసం తినక తప్పని పరిస్థితులు రావటం వల్ల జంతు కళేబరాలను పట్టుకుని వాటిని పదునైన ఆయుధాలతో కట్ చేసి ఆ ముక్కలు అలా పచ్చిగానే తినేవారు. పదునైన రాళ్లనూ ఇందుకోసం వినియోగించే వాళ్లు. మట్టిలో నుంచి దుంపలు తీసేందుకు వినియోగించిన పదునైన ఆయుధాలతోనే...జంతువుల తలభాగాన్ని పగలగొట్టి తినే వాళ్లు. క్రమంగా..వాటిని జీర్ణం చేసుకోవటం అలవాటు చేసుకున్నారు. 




(Image Credits: The Sun)


మాంసమే మనల్ని మనుషుల్ని చేసిందా? 


ఆదిమానవులతో పోల్చుకుని చూస్తే...మన మెదడు సైజ్ చాలా పెద్దది. ఈ మెదడు సరిగ్గా పని చేసేందుకు టన్నుల కొద్ది శక్తి అవసరం. మన శరీరంలోని శక్తిలో దాదాపు 20% మేర కేవలం మెదడు పని చేయడానికే పోతుంది. అయితే...ఈ శక్తి కోసమే ఆది మానవులు మాంసం తినటం మొదలు పెట్టారన్న వాదనా ఉంది. మెదడు చురుగ్గా పని చేసేందుకు, అప్పట్లో మాంసమే కీలక పాత్ర పోషించిందనీ అంటారు. కొందరు సైంటిస్ట్‌లు అయితే...మనల్ని ఆధునిక మానవుడిగా నిలబెట్టింది మాంసమే అని వాదిస్తారు. ఇందాక చెప్పుకున్నట్టు Homininsఎక్కువగా పండ్లు, ఆకులు, విత్తనాలు తిని బతికే వాళ్లు. ఇవి తొందరగా అరిగిపోయేవి. అంటే..జీర్ణశక్తి చాలా ఎక్కువగా వినియోగం అయ్యేది. అయితే రానురాను మానవ పరిణామ క్రమంలో పొట్ట పరిమాణం పెరిగింది. జీర్ణశక్తిలోనూ మార్పులు వచ్చాయి. శక్తి కోసం ఎక్కువ ఆహారం తీసుకోవాల్సి వచ్చేది. ఇందుకోసం జీర్ణశక్తి ఎక్కువగా ఖర్చయ్యేది. మాంసంలో అనేది హై ప్రోటీన్ ఉన్న ఫుడ్. ఆకలి తీర్చుకునేందుకు...ఎక్కువ  మొత్తంలో రోజూ మాంసం తినే వాళ్లు.




(Image Credits: The Sun)


మాంసం అంటే అంత ఇష్టం ఎందుకు..? 


ఎప్పుడైతే నిప్పు పుట్టిందో...అప్పుడు మాంసాన్ని జీర్ణం చేసుకోవటం ఇంకా సులభమైంది. పచ్చి మాంసాన్ని కాల్చి తినటం మొదలైంది. అరుగుదలకు అవసరమయ్యే శక్తి క్రమంగా తగ్గింది. ఫలితంగా..మెదడు బాగా పని చేస్తూ...పరిమాణం పెరిగింది. మాంసం తినటం హ్యూమన్‌ లైఫ్‌లో ఇప్పుడు చాలా కామన్‌గా మారిపోయింది. అప్పుడంటే...ఆదిమానవులు మాంసం అవసరం కాబట్టి తిన్నారు. ఇప్పుడు మనం ఇష్టం కొద్ది తింటున్నాం. అంతే తేడా. ఎంత కాదనుకున్నా..మన మూలాలు మనలోనే ఉంటాయి కదా. అందుకే...మనిషికి మాంసం అంటే అంత ఇష్టం. అఫ్‌కోర్స్...భిన్న సంస్కృతులు, ఆచారాలు పుట్టుకొచ్చాక..ఆహారపు అలవాట్లు మారిపోయాయి. కానీ...మాంసం ఆరగించటం మాత్రం మనిషి పూర్తిగా వదులుకోలేదు. సో..ఇదన్న మాట మన "మీట్ హిస్టరీ". 


Also Read: Queen Kubaba: ప్రపంచంలోనే మొట్టమొదటి క్వీన్ ఎవరో తెలుసా? మందు కలిపే మహిళే రాజ్యమేలిందట!


Also Read: History of Writing: రాయడం అనే ప్రక్రియ ఎప్పుడు ఎక్కడ మొదలైంది? ఆ బొమ్మలే అక్షరాలయ్యాయా?