సమాజంలో ఇంకా ఒకటికి మించి పెళ్లిళ్లు చేసుకుంటున్నవారు ఎంతో మంది. ఇద్దరు భార్యలను ఒక చోటే ఉంచగలిగేవారు ఎంత మంది? కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా ఒకే ఇంట్లో పదిహేను మంది భార్యలతో కలిసి నివసిస్తున్నాడు ఒక వ్యక్తి. వారికి 107 మంది పిల్లలు కూడా ఉన్నారు. వీరందరూ కలిసి సంతోషంగా జీవిస్తున్నారు. ఇంతకీ ఈ జంబో కుటుంబం ఎక్కడ నివసిస్తుందో తెలుసా? కెన్యాలోని ఓ చిన్న గ్రామంలో. మొక్కజొన్న పంటల మధ్య చక్కటి ఇల్లు. ఆ ఇంట్లోనే ఈ పెద్ద కుటుంబం జీవిస్తోంది. ఆ ఇంటి యజమాని పేరు డేవిడ్. వయసు 61 ఏళ్లు. అతనికి పదిహేను మంది భార్యలు. 


డేవిడ్ చాలా తెలివైన వాడు. 4000 పుస్తకాలు చదివాడు. తనలాంటి తెలివైన వాడిని ఒక భార్య తట్టుకోలేదని ఏకంగా పదిహేను మందిని పెళ్లి చేసుకున్నాడు.ఇంకా మరింత మందిని చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. కానీ కెన్యాలో పెళ్లి చేసుకున్న అమ్మాయికి కొంచెం భూమిని రాసివ్వాలి. అలా రాసేందుకు భూమి లేక తన భార్యల సంఖ్యను 15 మందితో ఆపేశాడు. ఆఫ్రికన్ చరిత్రలో ప్రముఖ రాజు కింగ్ సోలమన్. అతనికి 700 మంది భార్యలు. అతడే తనకు స్పూర్తి అని చెబుతున్నాడు డేవిడ్.


ఐక్యూ ఎక్కువట..
డేవిడ్ తన ఐక్యూ చాలా ఎక్కువని చెబుతున్నాడు. అందుకే తన బుర్రని ఒక మహిళ అర్థం చేసుకోవడం కష్టమని, ఆమె ఒక్కతే తన భారాన్ని మోయలేదని చెబుతున్నాడు డేవిడ్. ఈ భార్యలు మొదట్లో కాస్త గొడవలు పడేవారు. కానీ వారందరినీ ఒక క్రమశిక్షణలో పెట్టాడు. ఇప్పుడు ఇంట్లో చాలా కలిసిమెలిసి ఉంటున్నారు. వారంతా ఇంటి పనులను కేవలం అరగంటలో చేసేస్తారు. ఒకరు గిన్నెలు తోమడం, ఒకరు ఇల్లు తుడవడం, కూరగాయలు కట్ చేయడం, ఒకరు వంట ఇలా పదిహేను మంది బాధ్యతలు పంచేసుకుని అరగంటలో చేసేస్తారు.


ఉదయాన టీ, బ్రెడ్డుతో వీరు తమ రోజును మొదలుపెడతారు. కేవలం పదిహేను మంది భార్యలు, డేవిడ్ కోసమే దాదాపు పది ప్యాకెట్ల బ్రెడ్డులు ఖర్చువుతాయి. ఇతనికి మంచి భూమి ఉంది. దానిలోనే పంటలు పండించుకుని జీవనం సాగిస్తున్నారు. ఇల్లు కూడా అందరూ కలిసి చాలా శుభ్రంగా పెట్టుకుంటారు. ఈ భార్యలో కొందరు 15 మంది పిల్లల్ని కన్నారు. ఒకరు 11 మంది, ఇంకొకరు 7 మందిని కన్నారు. అందరూ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. 61 ఏళ్ల డేవిడ్ కు గతేడాది కూడా పిల్లలు పుట్టారు. డేవిడ్ వయసు కన్నా చాలా చిన్నవారని కూడా భార్యలుగా చేసుకున్నాడు. 30 ఏళ్ల వయసు తేడా కూడా వీరిలో ఉంది.  కుటుంబాన్ని పెంచడం కష్టంగా లేదా అంటే ‘కష్టమైనా పెంచాల్సిందే’ అని చెబుతున్నాడు డేవిడ్. 



Also read: భోజనం చేసిన వెంటనే ఎందుకు తలస్నానం చేయకూడదు?


Also read: మనిషి ఆయుష్షును పెంచే శక్తి ద్రాక్షకుంది, తేల్చిన తాజా అధ్యయనం