చాలా మందికి ఉన్న అలవాటు ఏంటంటే లేచిన వెంటనే బ్రష్ చేసి టీ, కాఫీలు తాగేస్తారు. కాసేపయ్యాక పొట్ట నిండా అల్పాహారాన్ని లాగిస్తారు. తిన్నాక తలకు స్నానం చేసి ఆఫీసుకు వెళతారు. కానీ తినేశాక తలకు స్నానం చేయకూడదని చెబుతారు పెద్దలు. కొంతమంది దీన్ని పాటిస్తారు కూడా. కానీ ఎందుకు అలా చేయకూడదు అంటారో, దాని వెనుక ఉన్న శాస్త్రీయ కారణమేంటో తెలుసా?


ఇందుకే చేయకూడదు...
స్నానం చేయడం అనేది శరీరాన్ని చల్లబరిచే శీతలీకరణ ప్రక్రియ. అందుకే భోజనం చేశాక స్నానం చేయడం వద్దని చెబుతోంది ఆయుర్వేదం కూడా. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు చెప్పిన ప్రకారం ఆహారం తిన్నాక స్నానం చేస్తే అది అరగడం కష్టమైపోతుంది. అందులోనూ తలకు స్నానం చేస్తే అది శరీర ఉష్ణోగ్రతలను తగ్గించేస్తుంది. దీని వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దీనివల్ల పొట్ట నొప్పి వంటి సమస్యలు మొదలుకావచ్చు. జీర్ణక్రియకు చాలా శక్తి అవసరం. పొట్ట వైపు రక్తప్రసరణ కూడా చక్కగా జరగాలి. స్నానం చేస్తే రక్త ప్రసరణ చురుగ్గా సాగదు. అంతేకాదు శరీర ఉష్ణోగ్రతలో అసమతుల్యత వచ్చేస్తుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు మొదలవుతాయి. అందుకే మన పూర్వీకులు కూడా ఎప్పుడైనా స్నానం చేశాకే ఆహారం తినాలని చెప్పారు.  


భోజనం చేయడానికి ఒకటి నుచి మూడు గంటల ముందే స్నానం చేయడం చాలా ఉత్తమం అని ఆయుర్వేదం చెబుతోంది. అయితే చల్లనీళ్లతో స్నానం చేసినప్పుడే ఇలాంటి ప్రభావాలు అధికంగా కనిపిస్తాయి. వేడి నీళ్ళతో చేస్తే కాస్త బెటర్. వెచ్చని నీటితో స్నానం చేయడం అనేది హైపర్ థెర్మిక్ చర్య అంటారు. ఇది శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. ఇది శరీరానికి ఎంతో మంచిది. మీ నాడీ వ్యవస్థను, రోగనిరోధక వ్యవస్థను రిలాక్స్ చేస్తుంది. వ్యర్థాలను బయటకు పంపడంలో ముందుంటుంది. 


ఆహారం తిన్నాక స్నానం చేయడం అనే పద్దతి ఊబకాయం, బరువు పెరగడం,జీర్ణవ్యవస్థ పనితీరు మందగించడం వంటి చెడు ప్రభావాలను కలిగిస్తుంది. రోగనిరోధక శక్తిపై కూడా ప్రతికూలంగా పనిచేస్తుంది కాబట్టి... ఆహారం తిన్నాక స్నానం చేయకపోవడమే మంచిది. ఒకవేళ చేయాల్సి వచ్చిన తిన్నాక కనీసం రెండు మూడు గంటలు ఆగాక చేయాలి. దీని వల్ల అప్పటికే ఆహారం చాలావరకు అరిగిపోతుంది. 


Also read: మనిషి ఆయుష్షును పెంచే శక్తి ద్రాక్షకుంది, తేల్చిన తాజా అధ్యయనం


Also read: ఈజిప్టు సమాధుల్లో వెల్లుల్లి రెబ్బలు, ప్రాచీన వైద్యంలో వీటిదే ప్రథమ స్థానం



















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.