దిండు కింద వెల్లుల్లి రెబ్బలు పెట్టుకుని నిద్రపోతే ఎంతో ఆరోగ్యం, అలాగే నిద్ర కూడా బాగా పడుతుంది... ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఓ నమ్మకం ఇది. ఆధునిక కాలంలో దీన్ని ‘ట్రాష్’ అంటూ కొట్టి పడేసేవాళ్లు ఎక్కువ. కానీ వెల్లుల్లి పవర్ తెలిసిన వారెవరూ అలా మాట్లాడరు. దిండు కింద పెట్టిన కూడా అది మన జీర్ణ వ్యవస్థ వరకు చేరుతుందట. కేవలం దాని వాసనలోని సుగుణాలే మనలో ఎన్నో అనారోగ్యాలకు చెక్ పెడతాయట. అందుకే ఒకప్పటి వైద్యంలో వెల్లుల్లిదే అగ్రస్థానం. దీని వినియోగం దాదాపు 7000 ఏళ్ల కిందట ప్రారంభమైనట్టు చెబుతున్నారు చరిత్రకారులు. ఇది పుట్టింది మధ్య ఆసియాలోనని, అక్కడ్నించి ఇతర దేశాలకు ఈ పంట పాకిందని చెబుతారు.
క్రీస్తుపూర్వం మూడవ సహస్రాబ్ది నుంచి వెల్లుల్లిలోని ఆరోగ్యప్రయోజనాలను ప్రాచీన వైద్యులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో చైనా, జపాన్, కొరియా దేశాల్లో వెల్లుల్లిని విరివిగా అమ్మి, ప్రజలు తినేలా చేసేవారు. ఇది జీర్ణక్రియ,శ్వాసక్రియ, అలసట, డిప్రెషన్ వంటి ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని వారి నమ్మకం. ప్రాచీన కొరియాలో వెల్లుల్లిన శక్తివంతమైన ఆహారంగా భావించేవారు.ప్రాచీన భారతదేశంలో, వెల్లుల్లి ఆయుర్వేద వైద్యంలో భాగంగా మారింది. దీన్ని గుండెజబ్బులు, ఆర్ధరైటిస్ చికిత్సకు ఉపయోగించినట్టు రాతపూర్వక రికార్డులు చెబుతున్నాయి.
ఆ రాజు సమాధిలో..
ప్రపంచంలో ఎంతో విచిత్రమైన సంప్రదాయాలు కలిగిన చరిత్ర ఈజిప్టుకే ఉంది. పురాతన ఈజిప్షియన్లు చనిపోయిన వారిని మమ్మీల రూపంలో మార్చడం ఇప్పటికే ఎంతో ఆసక్తికరమైన విషయం. 3,500 ఏళ్ల క్రితం ఈజిప్టు రాజు టుటాన్ఖామెన్‌ను మమ్మీగా మార్చినప్పుడు, అతని సమాధిలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు చల్లారు. అవి 1922లో టుటాన్ఖామెన్ సమాధిని తవ్వినప్పుడు బయటపడ్డాయి. ఇతడు చిన్నవయసులోనే మరణించిన ఈజిప్టు ఫారో. కేవలం 18 నుంచి 19 ఏళ్ల వయసులోనే మరణించాడు.
వెల్లుల్లి పవర్
వెల్లుల్లి వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలకు సైన్సు కూడా మద్దతునిస్తోంది. దీని నుంచి వచ్చే ఘాటైన వాసన చాలా అనారోగ్యాలకు పనిచేస్తుంది. నిద్రలేమి సమస్య ఉన్న వారు దీన్ని దిండుకింద పెట్టుకుని నిద్రపోతే, నిద్రకు సంబంధించిన సమస్యలనీ మాయమవుతాయి. ఇది దోమలు, కీటకాలను కూడా మీ దగ్గరికి రాకుండా తరిమికొడుతుంది. అయితే దీనికి శాస్త్రీయ వివరణ వెల్లుల్లిలో సల్ఫర్ ఉండటంతో ముడిపడి ఉంది. ఈ సల్ఫర్ వల్లే దాని నుంచి బలమైన వాసన వస్తుందని తేల్చారు.
దీనిలో అల్లిసిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ తో పోరాడి వృద్ధాప్యం త్వరగా రాకుండా అడ్డుకుంటుంది. జింక్ , ఐరన్ వంటి ఇతర పోషకాల శోషణను పెంచుతుంది. మధుమేహం నుండి ఉబ్బసం వరకు అనేక ఆరోగ్య స్థితులపై అల్లిసిన్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. అల్లిసిన్ రక్తపోటును తగ్గిస్తుంది. ప్లేట్‌లెట్స్ గడ్డకట్టకుండా నిరోధిస్తుంది, అంటే రక్తాన్ని పలుచగా చేసి రక్తంలో గడ్డలు ఏర్పడకుండా చేస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌పై కూడా పని చేస్తుంది. రక్తంలో చెడు కొవ్వుల పేరుకుపోకుండా చేస్తుంది.
పురాతన గ్రీకు సంప్రదాయంలో దేవాలయాలలో కూడా వీటిని దేవతలను ఆరాధించేందుకో లేక ప్రసాదాలగానో వాడేవారని అంటారు. గ్రీకులు తమ నావికులకు, యోధులకు వీటిని తినిపించి యుద్ధానికి పంపించేవారని చెబుతారు.
Also read: చచ్చి సాధించేది ఏమీ లేదు, బతికి సాధించండి
Also read: జ్వరం వచ్చినప్పుడు గుడ్లు, చేపలు, మాంసం తినవచ్చా?