జీవితమంటే... కేవలం సుఖాలే కాదే, కష్టాల కలబోత కూడా. కానీ సుఖాలు సంతోషంగా స్వీకరించే వారు, కష్టాలను మాత్రం ఎదుర్కొనేందుకు భయపడిపోతారు. అప్పును చూసో, అనారోగ్యం భరించలేకో, కుటుంబకలహాలతోనో, ఉద్యోగంలో ఒత్తిడి భరించలేకో ఆత్మహత్యలు చేసుకుంటారు. వారి ఉద్దేశంలో చనిపోతే సమస్యలు తీరిపోయినట్టే. అన్ని సమస్యలకు ఆత్మహత్యే పరిష్కారం అనుకుంటే ప్రపంచ జనాభాలో సగం మంది అదే పని చేయాలి. కానీ గుండె ధైర్యం కలవారు, జీవితం విలువ తెలిసిన వారు ఆత్మహత్య అనే పదాన్నే పలకరు. వందేళ్ల ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేసే హక్కు మీకు లేదు. ఈ జీవితాన్ని మీకు ఇచ్చింది మీ తల్లిదండ్రులు. వారి అనుమతి లేకుండా, వారిని ఒంటరిగా వదిలి, మీ కన్న బిడ్డలను కష్టాల్లో విడిచిపెట్టి ఆత్మహత్య చేసుకునే హక్కు మీకుందా? ఒక్కసారి ఆలోచించండి. అన్నింటికీ చావే పరిష్కారం కాదు, ప్రతి సమస్యలకు ఆలోచిస్తే రెండో పరిష్కారం దొరుకుతుంది. కాకపోతే కాస్త సమయం పడుతుంది. ఆ సమయంలోనే మీరు కాస్త గుండె ధైర్యంగా ఉండి, డిప్రెషన్‌కు గురికాకుండా ఉంటే చాలు. ఎంతో మంది సమస్యలను ఎదుర్కోలేక పిరికితనంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి చర్యలను అడ్డుకునేందుకే ప్రతి ఏటా సెప్టెంబర్ 10న ‘ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం (world suicide prevention day)’ నిర్వహిస్తారు.
మీరే గెలవండి...
ఆత్మహత్యా ఆలోచనలు వచ్చినప్పుడు మీలోని చెడు ఆలోచనతో మీరు యుద్ధం చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి.
ఎట్టకేలకు మీరే గెలవాలి. ఆత్మహత్య చేసుకుంటే పిరికివాడు అంటారు కానీ మంచివాడు, విజేత అనరు. అదే కష్టాలను తట్టుకుని నిలబడితే మాత్రం కచ్చితంగా ఏదో రోజు విజయాన్ని అందుకోవచ్చు. అప్పుడు మాత్రం మీరు విజేతే అవుతారు. ఆత్మహత్యా ఆలోచనలు వస్తే వాటిని ఎలా చంపాలో ఆలోచించండి, మిమ్మల్ని చంపుకునే ఆలోచనలు మానేయండి. బతికున్నప్పుడు సాధించిలేని వాళ్లు, చచ్చి సాధించేది సున్నా.
ఈ లక్షణాలు...
ఆత్మహత్య చేసుకోవాలని అనుకునే వ్యక్తిలో కొన్ని రోజులు లేదా కొన్ని గంటల ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి. వెంటనే తనను తాను కాపాడుకునేందుకు ప్రయత్నించాలి. మానసిక వైద్యులను కలవడమో లేక మనసుకు నచ్చిన స్నేహితుడు లేదా బంధువు దగ్గరికి వెళ్లి బాధనంత చెపుకోవాలి. తనకొస్తున్న ఆలోచన గురించి కూడా చెబితే వారు మీకు మానసికంగా సాయం చేసి ఆత్మహత్య చేసుకోకుండా అడ్డుకోగలరు.
1. నేనెందుకు జీవించాలి అని పదేపదే అనిపించడం
2. చికాకు పెరిగిపోవడం.
3. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడడం.
4. విలువైన వస్తువులను ఎవరికైనా ఇచ్చేయడం (ఇక నాకెందుకులే అనే భావనలో)
5. విపరీతంగా ఏడవడం, బాధ భరించలేకపోవడం
6. కుటుంబం నుంచి దూరంగా ఉండడం
7. ఆహారం తినడం మానివేయడం
8. సారీ అంటూ ఫోన్లో మెసేజులు పెుట్టాలనిపించడం...
ఇవన్నీ కూడా ఆత్మహత్యా ఆలోచనలు పెరిగిపోతున్న వ్యక్తిలో కనిపించే లక్షణాలు.
ఈ లక్షణాలను మీలో మీరు గమనించినా, స్నేహితుల్లో లేదా కుటుంబ సభ్యుల్లో కనిపించినా వెంటనే అప్రమత్తమవ్వండి.
Also read: జ్వరం వచ్చినప్పుడు గుడ్లు, చేపలు, మాంసం తినవచ్చా?
Also read: ఈ డైట్ ప్లాన్ పాటిస్తే వారం రోజుల్లో డయాబెటిస్ అదుపులోకి రావడం ఖాయం