వాతావరణం చల్లబడితే చాలు జ్వరాలు వ్యాప్తి చెందడం మొదలవుతాయి. వానాకాలంలో డెంగూ, మలేరియా, టైఫాయిడ్ రెచ్చిపోతాయి. ఈ సీజన్లో ఇంటికొకరు జ్వరంలో మంచానపడుతున్నారు. అయితే జ్వరంతో వచ్చిన వారు ఏం తినాలి? అన్న విషయంపై మాత్రం ఇప్పటికీ చాలా మందిలో అవగాహన లేదు. కోడిగుడ్లు, చికెన్, చేపలు వంటివి తినవచ్చా లేదో తెలియదు. ఎంతో మంది వీటిని తినకూడదని చెబుతారు, మరికొంతమంది తింటే శక్తి అందుతుందని చెబుతారు. వీటిల్లో ఏది నిజం? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు?


తినవచ్చా లేదా?
ఆరోగ్యనిపుణులు చెప్పిన ప్రకారం జ్వరం వచ్చినప్పుడు తేలికపాటి ఆహారం తీసుకోమని సూచిస్తుంటారు. దానికర్ధం నాన్ వెజ్ తినడం మానివేయమని అర్థం కాదు. తేలికపాటి ఆహారం అయితే ఆ సమయంలో సులువుగా అరుగుతుందని. అదే కోడి గుడ్లు, చికెన్, చేపల్లాంటివి అరగడానికి సమయం పడుతుందని వారి అభిప్రాయం. కానీ వీటిని తినడం వల్ల జ్వరం పెరుగుతుందని, ఇతరత్రా జబ్బులు వస్తాయని మాత్రం ఎక్కడా చెప్పలేదు. అజీర్తి సమస్యలు ఉన్నవారు తినకపోవడమే మంచిది. ఎలాంటి సమస్యలు లేనివారు, జ్వరం వచ్చినప్పుడు తినాలనిపిస్తే నిరభ్యంతరంగా కోడిగుడ్లు, చికెన్, చేపలు తినవచ్చు. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి ఆ సమయంలో ప్రొటీన్ అవసరం అది కూడా అందుతుంది. అందుకే ఆరోగ్యనిపుణులు ఈ  ప్రొటీన్ రిచ్ ఫుడ్స్ తినమనే సిఫారసు చేస్తున్నారు. 


ఎప్పుడు తినవద్దు?
జ్వరంతో బాధపడుతున్న వారి జీవక్రియ బలహీనంగా ఉన్నా, వికారం, వాంతులతో బాధపడుతున్నా... కోడిగుడ్లు, చేపలు, చికెన్ వంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. లేకుంటే అరగక వాంతులు, విరేచనాలు కావచ్చు. అవేవీ లేకపోతే హ్యాపీగా తినవచ్చు. కానీ మసాలా, కారం తగ్గించుకోవాలి. వికారం, అజీర్తి సమస్యలు కనిపిస్తే మాత్రం జ్వరం వచ్చినప్పుడు సూప్‌లు, గంజి, పప్పు రసాలు, చిక్కుళ్ల కూరలు తినడం మంచిది. ఇవన్నీ తేలికగా అరగి నీరసాన్ని తగ్గిస్తాయి. 


చేపలు, గుడ్లు, చికెన్ వంటివి ఆరోగ్యకరమైన ప్రోటీన్లు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు B6, B12, జింక్ , సెలీనియం వంటివి పుష్కలంగా దొరుకుతాయి. ఇవి ఎముకలు,మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. జ్వరం వచ్చినప్పుడు చికెన్ సూప్ వంటివి చేసుకుంటే చాలా మంచిది. శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తి, ప్రొటీన్లు అందుతాయి. జ్వరం వచ్చినప్పుడు తినడం వల్ల త్వరగా కోలుకుంటారు కూడా. కానీ జ్వరం వచ్చినసమయంలో మీకు అరిగించుకునే శక్తి ఉందంటేనే తినండి.  


Also read: ఈ డైట్ ప్లాన్ పాటిస్తే వారం రోజుల్లో డయాబెటిస్ అదుపులోకి రావడం ఖాయం


Also read: మనం రోజూ తినే ఆహారాలలో అలెర్జీకి కారణమయ్యేవి ఇవే






గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.