ఆసియాకప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం శ్రీలంక 17 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. దీంతో శ్రీలంక ఐదు వికెట్లతో గెలిచింది. మూడు వికెట్లు తీసిన వనిందు హసరంగకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయం ఫైనల్ ముందు శ్రీలంకు నైతిక బలాన్ని అందించనుంది.


టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్‌కు కోరుకున్న శుభారంభం లభించలేదు. స్కోరు బోర్డు మీద 28 పరుగులు చేరే సరికే మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత శ్రీలంక బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూనే ఉన్నారు. దీంతో కోలుకోలేకపోయింది. బాబర్ ఆజమ్ (30: 29 బంతుల్లో, రెండు ఫోర్లు), మహ్మద్ నవాజ్ (26: 18 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) మినహా మరెవ్వరూ కనీసం 15 పరుగులు కూడా చేయలేకపోయారు. దీంతో 19.1 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌట్ అయింది.


122 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక కూడా ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ కుశాల్ మెండిస్ (0: 1 బంతి), వన్‌డౌన్ బ్యాటర్ దనుష్క గుణతిలక (0: 4 బంతుల్లో) డకౌట్ అయ్యారు. అప్పటికి స్కోరు రెండు పరుగులు మాత్రమే. ఆ తర్వాత వచ్చిన ధనంజయ డిసిల్వ (9: 12 బంతుల్లో, ఒక ఫోర్) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు.


అయితే మరో ఓపెనర్ పతుం నిశ్శంక (55 నాటౌట్: 48 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) శ్రీలంకను ఆదుకున్నాడు. ఒకవైపు వికెట్లు మరో ఎండ్‌లో పాతుకుపోయాడు. భానుక రాజపక్స (24: 19 బంతుల్లో, రెండు సిక్సర్లు), దసున్ షనకల (21: 16 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) సహకారంతో మ్యాచ్‌ను గెలిపించాడు. ఆఖర్లో వనిందు హసరంగ (10 నాటౌట్: 3 బంతుల్లో, మూడు ఫోర్లు) బౌండరీలతో చెలరేగాడు.