Aaron Finch Retirment: ఆస్ట్రేలియా​కెప్టెన్ ఆరోన్ ఫించ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. వన్డే క్రికెట్​ఫార్మాట్‌కు రిటైర్మెంట్​ప్రకటించాడు. పొట్టి ఫార్మాట్ లో కొనసాగుతానని ఈ ఆసీస్ క్రికెటర్ స్పష్టం చేశాడు. న్యూజిలాండ్ తో ఆదివారం జరగనున్న వన్డే ఆరో ఫించ్ అంతర్జాతీయ కెరీర్ లో చివరి వన్డే కానుంది. ఈ క్రమంలో వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు ఫించ్ ప్రకటించి తన అభిమానులకు షాకిచ్చాడు. వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు శనివారం ఓ ప్రకటనలో తెలిపాడు.


ఫించ్ వన్డే కెరీర్ హైలైట్స్..
145 వన్డేలల్లో ఆసీస్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఆరోన్ ఫించ్ 17 శతకాల సాయంతో 5,401 పరుగులు సాధించాడు. 2015లో ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్ సాధించిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2020లో ఆస్ట్రేలియా మెన్స్ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు ఫించ్. రేపు న్యూజిలాండ్ తో జరగనున్న మూడో వన్డే ఫించ్ కెరీర్ లో చివరి వన్డే కానుందని తాజాగా ప్రకటించాడు. టీ20ల్లో కెప్టెన్ గా కొనసాగనున్నట్లు స్పష్టం చేశాడు ఫించ్.






వైఫల్యాలతో కీలక నిర్ణయం.. 
గత కొన్ని వన్డేల్లో ఆరోన్ ఫించ్ విఫలమవుతున్నాడు. కెప్టెన్‌గా ఆసీస్ జట్టును విజయాల బాటలో నడిపిస్తున్న ఫించ్‌ ఆటగాడిగా పరుగులు సాధించడంలో తడబాటుకు లోనవుతున్నాడు. చివరి 7 వన్డేల్లో 26 పరుగులు మాత్రమే చేశాడు. అందులో రెండుసార్లు డకౌట్స్ ఉన్నాయి. ఫించ్‌ కెప్టెన్సీలోనే ఆస్ట్రేలియా జట్టు తమ తొలి టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ను నెగ్గింది. 2013లో మెల్‌బోర్నో క్రికెట్ గ్రౌండ్ లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేసిన ఫించ్.. స్కాట్లాండ్ పై వన్డేల్లో తొలి శతకం (148) నమోదుచేశాడు.






వన్డే రిటైర్మెంట్ పై ఫించ్..
‘వన్డే ఫార్మాట్లో ఎన్నో మైలురాళ్లు చేరుకున్నాను. చాలా అద్భుతంగా ఆట కొనసాగింది. ఎన్నో మెమరీస్ ఉన్నాయి. అద్భుతమైన విజయాలలో పాలు పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తోటి ఆటగాళ్లు, సీనియర్ సహకారం అందించడంతో ఈ స్థాయికి చేరుకున్నాను. కొత్త వారికి అవకాశం ఇవ్వడానికి ఇది సరైన సమయం. వచ్చే వరల్డ్ కప్ కోసం కొత్త వారికి జట్టులో అవకాశాలు రావాలి. నా కెరీర్ లో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని ఓ ప్రకటనలో తెలిపాడు.


Also Read: SL vs PAK, Match Highlight: పాకిస్తాన్‌ను ఓడించిన శ్రీలంక - ఫైనల్‌కు ముందు ఆత్మవిశ్వాసం