లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు వైజాగ్‌లో ఘన సన్మానం జరిగింది. తన 70 ఏళ్ల  సినీ కెరీర్ లో ఎన్నో కళాఖండాలను రూపొందించిన సింగీతం శ్రీనివాసరావుకు కొప్పరపు కవుల కళాపీఠం 20 సంవత్సరాల వేడుకలో ఘన సన్మానం చెశారు. జాతీయ ప్రతిభా పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి మహాసహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు అధ్యక్షత వహించగా.. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, మాజీ డిప్యుటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, కూటికుప్పల సూర్యారావు పాల్గొన్నారు. 

 

వయస్సు 92.. సినీ కెరీర్ 70 ఏళ్ళు :

 

1972లో నీతి నిజాయితీ సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టిన సింగీతం శీనివాసరావు ఆల్ టైం క్లాసిక్ మాయా బజార్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. కమల్ హాసన్‌తో సొమ్మొకడిది సోకొకడిది, విచిత్ర సోదరులు, మైఖేల్ మదన కామరాజు, పుష్పక విమానం లాంటి ప్రయోగాత్మక చిత్రాలు తీసి హిట్ కొట్టారు. బాలకృష్ణతో ఆదిత్య 369, భైరవ ద్వీపం లాంటి  మరపురాని సినిమాలు అందించారు సింగీతం. 92 ఏళ్ల వయస్సులోనూ యాక్టివ్‌గా ఉంటున్న ఆయన ఇప్పటి తరం దర్శకులకు కూడా సాంకేతికపరమైన సలహాలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఎక్స్పెరిమెంటల్ సినిమాలకు కమర్షియల్ టచ్ ఇవ్వడం అనేది సింగీతం శ్రీనివాసరావుతోనే మొదలైంది. 

 

70 ఏళ్ల కెరీర్‌లో ఎంతో మంది సంగీత దర్శకులతో పనిచేసా : సింగీతం 

 

తన సుదీర్ఘమైన కెరీర్‌లో ఎంతోమంది మహానుభావులైన సంగీత దర్శకులతో పనిచేసే అవకాశం తనకు కలిగిందని అన్నారు దర్శకులు సింగీతం శ్రీనివాసరావు. ఎక్కువగా త్యాగరాజ స్వామి పద్యాలను తన సినిమాలలో ఇరికించే ప్రయత్నం చేసేవాడినని .. అదే  తనకు కొప్పరపు కవుల జాతీయ పురస్కారం లభించడానికి కారణం అయిందని సంతోషం వ్యక్తం చేసారు ఆయన. అత్యంత వేగంగా ఆశు కవిత్వం చెప్పే కొప్పరపు కవులు కూడా వాగ్గేయకారుల కోవకే చెందుతారని సంగీతం అభిప్రాయపడ్డారు. ఒకే వేదికపై ఎంతోమంది మహానుభావులను కలుసుకునే అవకాశం దక్కడమే తనకు లభించిన అసలైన అవార్డు అని సింగీతం శ్రీనివాసరావు అన్నారు. వైజాగ్‌లో జరిగిన  కార్యక్రమం లో పాల్గొన్న సీనియర్ దర్శకులనూ , దిగ్గజ సాహిత్య వేత్తలనూ చూడడానికి జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.