Krishnam Raju Political Career:
రెబల్ స్టార్ రాజకీయ ప్రస్థానం
1970, 1980లలో కృష్ణంరాజు కెరీర్ ఓ రేంజ్‌లో సాగిపోయింది. అనంతరం ఆయన రాజకీయాలవైపు మొగ్గుచూపారు. కృష్ణంరాజు 1991లో మొదట కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాది నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీచేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్ రాజు చేతిలో ఓటమిపాలయ్యారు. దాంతో కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయినా ఆయన వెనక్కు తగ్గలేదు. 1998లో రీ ఎంట్రీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీలో చేరి కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీచేసి విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టారు.
ఓడిన చోటే విజయం సాధించిన రెబల్ స్టార్..
పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తొలిరోజుల్లో పోటీ చేసి ఓడిన స్థానం నుంచి మళ్లీ బరిలోకి దిగి విజయం సాధించారు కృష్ణంరాజు. 1999 మధ్యంతర ఎన్నికల్లో నర్సాపురం లోక్‌సభ నుంచి బరిలోకి దిగిన కృష్ణంరాజు అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై గెలుపొందారు. అప్పటి ప్రధాని వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుతంలో మంత్రి పదవి దక్కించుకున్నారు.
2004 లోక్‌సభ ఎన్నికలలో మరోసారి నర్సాపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన కృష్ణంరాజు కాంగ్రెస్ అభ్యర్థి జోగయ్య చేతిలో ఓడిపోయారు. కొంతకాలం సైలెంట్ గా ఉన్న రెబల్ స్టార్ రూట్ మార్చారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో 2009లో చేరారు. రాజమండ్రి నుంచి టికెట్ దక్కడంతో లోక్‌సభకు పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఓటమి చెందడం, అనంతరం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో కృష్ణంరాజు పాలిటిక్స్‌కు దూరంగా ఉంటూ వచ్చారు. 2014లో మళ్లీ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనను తమిళనాడు గవర్నర్ గా నియమిస్తారని ప్రచారం జరిగింది. కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలి లోని ఐఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (సెప్టెంబర్ 11న) తుదిశ్వాస విడిచారు (Krishnam Raju Is No More).
కీలక పదవులు..
- 1999-2000 మధ్య కాలంలో లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ స్కీమ్ కమిటీలో సభ్యుడిగా కొనసాగారు.
- 2000లో కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖలో సలహాకమిటీలో సభ్యుడిగా సేవలందించారు.
- 2000 సెప్టెంబర్ 30 నుంచి 2004 మే 22 వరకు కేంద్రంలో సహాయ మంత్రిగా చేశారు.
- 2000 సెప్టెంబర్ 30 నుంచి 2001 జులై 22వరకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా కృష్ణంరాజు సేవలందించారు. 2001 జులై 22 నుంచి 2002 జూన్ 20 వరకు రక్షణ శాఖ సహాయ మంత్రిగా సేవలు అందించారు.
- 2002 జులై 1న వినియోగదారుల వ్యవహరాలు, ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రి అయ్యారు
- 2003 జనవరి 29 నుంచి 2004 మే 22 వరకు కేంద్ర గ్రామీణాభివద్ధి శాఖ సహాయ మంత్రిగా సేవలు