Nara Lokesh Letter to CM Jagan on Groups Jobs Age Limit: ఏపీలో గ్రూప్ - 1, 2 పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్ కు లేఖ రాశారు. ఉద్యోగాల భర్తీలో రాష్ట్రంలో తెలంగాణ విధానాన్నే అమలు చేయాలని అన్నారు.
జాబ్ క్యాలెండర్ - ప్రభుత్వ వైఫల్యం
రాష్ట్రంలో వార్షిక జాబ్ క్యాలెండర్ జారీలో ప్రభుత్వం విఫలమైందని నారా లోకేశ్ విమర్శించారు. ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, నాలుగున్నరేళ్లలో యువత భవిత నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందున హడావుడిగా నోటిఫికేషన్లు రిలీజ్ చేసి మరోసారి వంచనకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రశ్నిస్తే అక్రమ కేసులు
ఎవరైనా ప్రభుత్వ అక్రమాలపై ప్రశ్నిస్తే వారిపై కేసులు పెడుతూ బెదిరిస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. యువగళం పాదయాత్రలో భాగంగా అనకాపల్లి జిల్లా యలమంచిలిలో విశ్రాంత ఉద్యోగులతో ఆయన గురువారం ముఖాముఖి నిర్వహించారు. వైసీపీ నేతలు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నట్లు విమర్శించారు. రాబోయే ఎన్నికలు పేదవాళ్లకు, వైసీపీ దోపిడీ దారులకు మధ్య జరిగే ఎన్నికలని, అంతా ఆలోచించి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. ఇసుక, మద్యం ఇలా అన్నింటిలోనూ వైసీపీ నేతలు అడ్డగోలుగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. విద్య, వైద్యం ఇలా అన్ని రంగాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అటు, ఏపీ ప్రభుత్వంపై టీడీపీ మరో నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం విమర్శలు చేశారు. ఏపీని నిరుద్యోగంలో నెంబర్ వన్ చేశారని, 24 శాతంతో నిరుద్యోగంలో అగ్రస్థానంలో ఉందని ఎద్దేవా చేశారు. జాతీయ సగటు నిరుద్యోగం 13.4 శాతం ఉందని, బీహార్ కంటే ఏపీ వెనుకబడి ఉందని మండిపడ్డారు. ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు ఉద్యోగాలు, ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారని అన్నారు.
Also Read: Chandrababu : 151 మందిని మార్చినా గెలవలేరు - జగన్‌కు చంద్రబాబు సవాల్ !