తమిళనాడు ఈరోడ్ జిల్లాలో చితోడ్ లో ఓ పరిశ్రమలో విష వాయువు లీక్ అయింది. ఈ ప్రమాదంలో ఆ పరిశ్రమ యజమాని మృతి చెందగా, 13 మంది ఆసుపత్రి పాలయ్యారు. లిక్విడ్ క్లోరిన్ గ్యాస్ లీకేజీ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీధర్ కెమికల్స్ లో శనివారం మధ్యాహ్నం క్లోరిన్ గ్యాస్ పైపులో సమస్య తలెత్తి గ్యాస్ లీక్ అయింది. ప్రమాద సమయంలో పరిశ్రమలో ఉన్న యజమాని దామోదరన్(40) క్లోరిన్ గ్యాస్ పీల్చి అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మరో 13 మంది ఈ విషవాయువు పీల్చడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో వారిని ఈరోడ్‌లోని తాంథై పెరియార్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Also Read: Night Curfew: మళ్లీ నైట్ కర్ఫ్యూలు .. రాష్ట్రాలకు కేంద్రం సూచనలు !
గ్యాస్ వ్యాప్తిని నియంత్రిస్తున్న రెస్క్యూ టీమ్స్
పరిశ్రమలోని ఇతర కార్మికులను రక్షించేందుకు నాలుగు ఫైర్, రెస్క్యూ సర్వీస్ వాహనాలను ఘటన స్థలంలో మోహరించారు. గ్యాస్ లీక్ వ్యాప్తి చెందకముందే నియంత్రించేందుకు అగ్ని మాపక బృందాలు పనిచేస్తున్నాయి. సంఘటనా స్థలాన్ని ఈరోడ్ కలెక్టర్ హెచ్ కృష్ణనున్ని, ఎస్పీ శశిమోహన్ పరిశీలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: PM Modi: సైనికుడు మిలటరీలో ఉన్నంతవరకే కాదు.. జీవితాంతం యోధుడే
వైజాగ్ లోనూ ఇలాంటి ప్రమాదం
ఇలాంటి ఘటనే గత ఏడాది మేలో ఏపీలోని వైజాగ్‌లో చోటుచేసుకుంది. ఈ విషాద సంఘటనలో స్టైరిన్ గ్యాస్ లీక్ అయ్యి 12 మంది మరణించారు. 585 మంది అస్వస్థతకు గురయ్యారు. లీకేజీ కారణంగా చుట్టుపక్కల ఉన్న జంతువులు, మొక్కలు కూడా దెబ్బతిన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఎల్‌జీ పాలిమర్స్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సుంకీ జియాంగ్, టెక్నికల్ డైరెక్టర్ డీఎస్ కిమ్, అడిషనల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) పూర్ణ చంద్రమోహన్ రావులను విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన మిగిలిన ఉద్యోగులలో ప్రొడక్షన్ టీమ్ లీడర్, ముగ్గురు ఇంజనీర్లు, ఒక ఆపరేటర్, ఆపరేషన్ కోసం నైట్ డ్యూటీ ఆఫీసర్, నైట్ షిఫ్ట్ సేఫ్టీ ఆఫీసర్ ఉన్నారు. ఈ ఘటనపై అప్పట్లో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ముఖ్యమంత్రి జగన్ కు నివేదిక అందించింది.
Also Read : వామ్మో ఒమిక్రాన్.. ఒక్క రోజులో 4 వేల మందికా? గత వైరస్‌ల కంటే వేగంగా కొత్త వైరస్!