ఉత్తర్ప్రదేశ్ బలరాంపుర్లో నిర్మించిన సరయూ నహర్ నేషనల్ ప్రాజెక్టును ప్రధాని మోడీ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు. ఈ సందర్భంగా.. హెలికాప్టర్ క్రాష్ లో మృతి చెందిన సైనికులను మోడీ స్మరించుకున్నారు. రాబోయే రోజుల్లో ఇండియాను మరింత శక్తిమంత దేశంగా తీర్చిదిద్దుతామని ప్రధాని మోడీ అన్నారు. ఇదంతా బిపిన్ రావత్ చూస్తుంటారని మోడీ వ్యాఖ్యానించారు. భారత సైన్యం స్వయం సమృద్ధి సాధించే దిశగా రావత్ కృషి చేశారని కొనియాడారు.
సైనికులు మిలటరీలో ఉన్నంతవరకే సైనికులు కాదని.. జీవితాంతం వారు యోధులేనని ప్రధాని మోడీ అన్నారు. బిపిన్ రావత్ ఎక్కడున్నా.. భారత్ అభివృద్ధిని చూస్తుంటారని అన్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఆరోగ్యంపై మోడీ మాట్లాడారు. వైద్యులు ఆయనను కాపాడేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. భారతదేశం.. వరుణ్ సింగ్ కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. 'ఇద్దరు భారతరత్నలు ఇక్కడివారే'నని బలరాంపుర్ ప్రజలను ఉద్దేశించి మోడీ వ్యాఖ్యానించారు. నానాజీ దేశ్ముఖ్, అటల్ బిహారీ వాజ్పేయీ రూపంలో దేశానికి ఇద్దరు భారతరత్నలను అందించారన్నారు.
40 ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న జాతీయ ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేసినట్టు మోడీ వెల్లడించారు. పెండింగ్ లో ఉన్న సరయూ నహర్ నేషనల్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం.. నిబద్ధతతో పనిచేసిందన్నారు. యూపీ తూర్పు ప్రాంతంలో రైతుల కష్టాలు ఈ ప్రాజెక్టుతో తీరుపోనున్నట్టు మోడీ చెప్పారు. రూ.9.800 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టామని.. నాలుగేళ్లలోనే రూ.4600 కోట్లను వెచ్చించామన్నారు.
Also Read: Aadhaar Card News: ఆధార్ కార్డులో అడ్రెస్, పేరు, పుట్టిన తేదీ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు?
Also Read: నాడు ఆంధ్రా యూనివర్సిటీ స్టూడెంట్.. నేడు పెన్సిల్వేనియా వర్సిటీ తొలి మహిళా ప్రెసిడెంట్