జమ్ముకశ్మీర్‌లో డ్రోన్లు మళ్లీ కలకలం సృష్టించాయి. జమ్ము, సాంబా ప్రాంతాల్లోని నాలుగు వేరువేరు చోట్ల ఆదివారం రాత్రి డ్రోన్లు దర్శనమిచ్చాయి. సాంబాలోని బడి బ్రాహ్మణ, బిరాపుర్, జమ్ములోని బిస్నాలో డ్రోన్లు కనిపించాయి. దీంతో భారత సైన్యం అప్రమత్తమైంది. డ్రోన్ల కోసం గాలింపు చర్యలు చేపట్టింది. జమ్ముకశ్మీర్‌లోని వివిధ జిల్లాల్లో భద్రత దళాలు గాలింపు చేపడుతున్నాయి.


స్థానికుల సమాచారం..


జమ్ములోని డోమనా ప్రాంతంలో డ్రోన్‌ను పోలి ఉన్న ఓ వస్తువును శనివారం రాత్రి స్థానికులు గమనించారు. వేరే చోట కూడా ఇలాంటి డ్రోన్లు రెండు కనిపించడంతో సైన్యానికి సమాచారమిచ్చారు. సాంబాలో రాత్రి 8-9 గంటల మధ్య మరో రెండు డ్రోన్లు కనిపించాయి.


జూన్‌లో జమ్మూలో జరిగిన రెండు డ్రోన్ దాడుల తర్వాత భద్రతా దళాలు చాలా అప్రమత్తంగా ఉంటున్నాయి. ఈ ఘటన జరిగిన తర్వాత జమ్ముకశ్మీర్ లోని మూడు జిల్లాల్లో డ్రోన్ల అమ్మకం, తయారీ, స్టోరేజీపై బ్యాన్ విధించింది ప్రభుత్వం. అన్ మేన్డ్ ఏరియల్ వెహికల్స్ పైనా ఈ నిషేధం ఉంది. బారాముల్లా, సాంబా, రంబాన్ జిల్లాల్లో ఈ నిషేధం విధించారు.


అధిక జనాభా ఉన్న ప్రాంతాలు, సున్నితమైన ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ బ్యాన్ విధించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రదేశాల్లో ఎవరైనా డ్రోన్లను వినియోగిస్తే ఆపరేటర్, ఓనర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, వాటి వల్ల జరిగే ఎలాంటి నష్టానికైనా వారే బాధ్యులని అధికారులు హెచ్చరించారు.


పాక్ దుస్సాహసం..


జమ్మూలోని వైమానిక దళం స్థావరంపై ఇటీవల డేగల వంటి అజ్ఞాత డ్రోన్లు పేలుడు పదార్థాలను జారవిడవడం భద్రతా దళాలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. భారత్‌ అత్యాధునిక యుద్ధసామర్థ్యాలకు ఇది పరీక్ష. డ్రోన్‌ ను ముందే పసిగట్టడం లేదా కూల్చివేయడం సంగతి పక్కన పెడితే, కనీసం అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా వెంటనే గుర్తించలేకపోయారు. ఆ తరవాత పలు డ్రోన్లు వివిధ సైనిక స్థావరాల సమీపంలో దర్శనమిచ్చాయి. భారత్‌ వేగంగా మేలుకోకపోతే వ్యూహాత్మక ఆధిపత్యాన్ని పాక్‌, దాని ఉగ్రసంస్థలకు అప్పనంగా అప్పజెప్పినట్లేనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


కొంతకాలంగా కశ్మీర్‌లో భారత సైన్యం వ్యూహాత్మకంగా ముందడుగు వేయడం వల్ల స్థానికులు ఉగ్రవాదం వైపు మళ్లడం కొంత వరకు తగ్గింది. ఫలితంగా పాక్‌ ఇప్పుడు డ్రోన్లపై దృష్టి పెట్టింది. భూమికి అతి తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల వీటి ఆచూకీ గుర్తించడం రాడార్లకు కష్టం. చౌకగా లభించే వాణిజ్యశ్రేణి క్వాడ్‌కాప్టర్లు సైతం.. సరిహద్దుల్లోని గగనతల రక్షణ వ్యవస్థ రాడార్లు, కమ్యూనికేషన్‌ కేంద్రాలు, రాకెట్‌ లాంఛర్లను దెబ్బతీయగలవు. ఇలాంటి పరిస్థితినే అజర్‌బైజాన్‌తో యుద్ధంలో అర్మీనియా ఎదుర్కొంది.


ALSO READ: Drone War: ఇక ఆయుధాలు మాయం.. అంతా 'డ్రోన్ల' మయం