Supreme Court - CJI Lalit: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. సీజేఐగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత సుప్రీం కోర్టు జెట్ స్పీడ్‌తో పనిచేస్తోంది. నాలుగు రోజుల్లో దాదాపు 1800 కేసులకు సుప్రీం కోర్టు పరిష్కారం చూపింది.
వేగంగా పూర్తి
చీఫ్ జస్టిస్‌గా యూయూ లలిత్ కేవలం 74 రోజుల పాటు పదవిలో ఉంటారు. నవంబర్ 8న ఆయన రిటైర్ అవుతారు. దీంతో తక్కువ వ్యవధిలో కేసులకు శరవేగంగా పరిష్కారం చూపించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆగస్ట్ 27న భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ బాధ్యతలు స్వీకరించారు. మొదటి నాలుగు రోజుల్లోనే సుప్రీంకోర్టులో 1,293 కేసులను పరిష్కరించారు. 1,293 కేసుల్లో ఆగస్ట్ 29న 493, 30న 197, సెప్టెంబర్ 1న 228, సెప్టెంబర్ 2న 315 కేసులు పరిష్కారమయ్యాయి. ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారించే 106 రెగ్యులర్ కేసులను కూడా తేల్చేసినట్టు సీజేఐ తెలిపారు. మరో 440 కేసుల బదిలీ పిటిషన్లను పరిష్కరించినట్టు చెప్పారు. దీంతో మొత్తం 1800 కేసుల వరకు విచారించినట్లయింది.
ఇంకా చేస్తాం
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ యూయూ లలిత్.. తాను బాధ్యతలు స్వీకరించిన మొదటి వారం రోజుల్లో కోర్టు పనితీరు గురించి వివరించారు.
ప్రొఫైల్
- 1957 నవంబరు 9న జన్మించారు జస్టిస్ యూయూ లలిత్.
- 1983 జూన్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు.
- 1985 డిసెంబరు వరకు బొంబాయి హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టీసు చేశారు.
- 1986 జనవరి నుంచి తన ప్రాక్టీసును సుప్రీం కోర్టుకు మార్చారు.
- 2014, ఆగస్టు 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
పని వేళలపై
సుప్రీం కోర్టు పనివేళలపై న్యాయమూర్తిగా ఉన్న సమయంలో జస్టిస్ యూయూ లలిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లలు రోజూ ఉదయం 7 గంటలకే బడికి వెళ్లగలిగినప్పుడు, కోర్టులు కూడా రోజూ ఉదయం 9 గంటలకు విధులను ఎందుకు ప్రారంభించలేవని ప్రశ్నించారు.
" కోర్టు కార్యకలాపాలు త్వరగా ప్రారంభమవాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. రోజూ ఉదయం 9 గంటలకు విచారణలు ప్రారంభించడం సరైన సమయం. మన పిల్లలు ఉదయం ఏడు గంటలకు బడికి వెళ్లగలుగుతున్నపుడు, మనం ఉదయం 9 గంటలకు కోర్టుకు ఎందుకు రాలేం? సుప్రీంకోర్టు ధర్మాసనాలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవ్వాలి. ఉదయం 11.30 గంటలకు అర గంట సేపు విరామం తీసుకోవాలి. మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ ప్రారంభించాలి. దీనివల్ల సాయంత్రం మరిన్ని ఎక్కువ పనులు చేయడానికి వీలవుతుంది. "
-జస్టిస్ యూయూ లలిత్, సీజేఐ
సుప్రీం సమయం
పని దినాల్లో ఉదయం 10.30 గంటలకు సుప్రీం కోర్టు కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు భోజన విరామం ఉంటుంది. అనంతరం సాయంత్రం 4 గంటల వరకు కార్యకలాపాలు జరుగుతాయి.
Also Read: Tejashwi Yadav: డ్యూటీలో నిద్రపోతూ డిప్యూటీ సీఎంకు దొరికిపోయాడు!
Also Read: Covid Update: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు- 27 మంది మృతి