ఎన్నికల్లో గెలవాలంటే ఏం చేయాలి ?. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఒకే ఒక్క షార్ట్ కట్‌ను ఎంచుకుంటున్నాయి. అదే ఉచిత హామీలు.  నగదు బదిలీ దగ్గర్నుంచి అనేకానేక పథకాల కింద నిత్యావసర వస్తువులు, స్కూటర్లు, ల్యాప్‌ట్యాప్‌లు ఇలా సమస్తం ఉచితంగా ఇస్తామని హామీలు గుప్పిస్తున్నాయి. ఎవరి హామీలు జనానికి నచ్చుతాయో వారే గెలుస్తున్నారు. గెలిచిన తరవాత అర్హుల పేరుతో అందర్నీ వడపోసి..  నియోజకవర్గానికి వంద మందికో. .. రెండు వందల మందికో ఇచ్చి పబ్లిసిటీ మాత్రం చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి ఉచిత హామీలు ఇవ్వడంపై చాలా కాలంగా విమర్శలు ఉన్నాయి. ఇది చట్ట విరుద్ధమంటూ సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలయింది. 


Also Read: నిత్యావసర ధరలకు కళ్లెం, సొంత కాళ్లపై నిలబడేలా సాయం.. నిర్మలమ్మ నుంచి ఈ సారి మహిళలు కోరుకుంటున్నది ఇదే !


ఎన్నికలకు ముందు ప్రజానిధులతో ఉచిత తాయిలాలు పంచిపెడుతూ, ఉచిత హామీలిస్తున్న పార్టీల ఎన్నికల గుర్తును స్తంభింప చేయాలని, రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని బీజపీ నేత, న్యాయవాది అశ్విన్ ఉపాధ్యాయ పిల్ దాఖలు చేశారు. విచారణ జరిపింది భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ, న్యాయవాదులు ఏఎస్ బోపన్న, హిమాకోహ్లితో కూడిన ధర్మాసనం  ఎన్నికల కమిషన్, కేంద్రంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉచిత హామీలు తీవ్రమైన అంశమని పేర్కొంటూ నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.


'ఈ చట్టవిరుద్ధమైన వ్యవహారాన్ని అదుపు చేయడం ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నానని సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యాించారు. ఈ ఎన్నికల్లోపే ఇది చేయగలమా? వచ్చే ఎన్నికలకు చేయగలమా? అని ప్రశ్నించారు. ఉచిత హామీల బడ్జెట్ రెగ్యులర్ బడ్జెట్‌ను మించిపోతోందని గుర్తు చేశారు. ఓటర్ల నుంచి రాజకీయ లబ్ధి పొందటం కోసం అనుసరిస్తున్న జనాకర్షణ విధానాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, దీనిపై నిషేధం విధించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇందుకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.


Also Read: సమూల సంస్కరణలకు ప్రోత్సాహం - మరుమూల ప్రాంతాలకూ ఆన్ లైన్ విద్య సదుపాయం ... ఈ సారి బడ్జెట్‌పై విద్యారంగానికి ఆశలెన్నో !.


కేంద్రం, ఎన్నికల సంఘం వేసే అఫిడవిట్‌ ను బట్టి సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. హామీల విషయంలో రాజకీయ పార్టీలు ఏ  హద్దులూ పెట్టుకోవడం లేదు. ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పడం లేదు. ఎన్నికల సంఘం మేనిఫెస్టోల్లో ఇచ్చే హామీలు ఆచరణ సాధ్యమా కాదా అన్నదానిపై వివరణ తీసుకుంటూ ఉంటుంది. కానీ అది వర్కవుట‌్ కావడం లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు చొరవతో కీలకమైన సంస్కరణలు ఏమైనా వస్తాయేమో చూడాలి..! 


Also Read: సివిల్ సర్వీస్ కేడర్ రూల్స్‌లో మార్పులకు కేంద్రం సిద్దం - వ్యతిరేకిస్తూ కేసీఆర్ లేఖ !




ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి