SC Constitution Bench: సుప్రీం కోర్టులో జరిగే కేసుల విచారణను ఇక ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. న్యాయస్థానం కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 27 నుంచి రాజ్యంగ ధర్మాసనం విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు.
కీలక నిర్ణయం
సెప్టెంబరు 27 నుంచి రాజ్యాంగ ధర్మాసన విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దీంతో పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్ 370 వంటి కీలక కేసులకు సంబంధించిన విచారణలను దేశ ప్రజలంతా ప్రత్యక్షంగా చూడొచ్చు.
సీజేఐ జస్టిస్ లలిత్ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం ఫుల్ కోర్ట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే సుప్రీంకోర్టు విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. తొలుత రాజ్యాంగ ధర్మాసన విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఆ తర్వాత అన్ని ధర్మాసనాల విచారణలను కవర్ చేయనున్నారు. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ యూయూ లలిత్ ఆధ్వర్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
యూట్యూబ్‌లో
ప్రస్తుతానికి కొన్ని రోజుల పాటు యూట్యూబ్‌లో వీటిని టెలికాస్ట్ చేయాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రత్యక్ష ప్రసారాల కోసం త్వరలోనే సుప్రీం కోర్టు సొంత ప్లాట్‌ఫామ్‌ను తయారు చేసుకోనుందని తెలిపాయి.
కేసుల విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి అనుకూలంగా సుప్రీం కోర్టు 2018లోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆచరణలోకి రాలేదు. సర్వోన్నత న్యాయస్థానం విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ సహా పలువురు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అప్పట్లో కోర్టు సానుకూలంగా ఉత్తర్వులు వెలువరించింది.
పని వేళలపై
సుప్రీం కోర్టు పనివేళలపై న్యాయమూర్తిగా ఉన్న సమయంలో జస్టిస్ యూయూ లలిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లలు రోజూ ఉదయం 7 గంటలకే బడికి వెళ్లగలిగినప్పుడు, కోర్టులు కూడా రోజూ ఉదయం 9 గంటలకు విధులను ఎందుకు ప్రారంభించలేవని ప్రశ్నించారు.
" కోర్టు కార్యకలాపాలు త్వరగా ప్రారంభమవాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. రోజూ ఉదయం 9 గంటలకు విచారణలు ప్రారంభించడం సరైన సమయం. మన పిల్లలు ఉదయం ఏడు గంటలకు బడికి వెళ్లగలుగుతున్నపుడు, మనం ఉదయం 9 గంటలకు కోర్టుకు ఎందుకు రాలేం? సుప్రీంకోర్టు ధర్మాసనాలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవ్వాలి. ఉదయం 11.30 గంటలకు అర గంట సేపు విరామం తీసుకోవాలి. మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ ప్రారంభించాలి. దీనివల్ల సాయంత్రం మరిన్ని ఎక్కువ పనులు చేయడానికి వీలవుతుంది. "
-జస్టిస్ యూయూ లలిత్, సీజేఐ
సుప్రీం సమయం
పని దినాల్లో ఉదయం 10.30 గంటలకు సుప్రీం కోర్టు కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు భోజన విరామం ఉంటుంది. అనంతరం సాయంత్రం 4 గంటల వరకు కార్యకలాపాలు జరుగుతాయి.
Also Read: Lawsuit Against Trump: 'డ్రెస్సింగ్ రూమ్‌లో నన్ను రేప్ చేశాడు'- డొనాల్డ్ ట్రంప్‌పై సంచలన ఆరోపణలు
Also Read: Delhi Road Accident: రోడ్డు డివైడర్‌పై నిద్రిస్తోన్న వారిపైకి దూసుకెళ్లిన ట్రక్కు- నలుగురు మృతి!