Shraddha Murder Case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలా బెయిల్ కోరుతూ దిల్లీలోని సాకేత్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు. పోలీసుల దర్యాప్తు అనంతరం అఫ్తాబ్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. అతని బెయిల్ పిటిషన్ రేపు విచారణకు రానుందని వార్తా సంస్థ ANI తెలిపింది.


సంచలనం


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. శ్రద్ధాను అత్యంత దారుణంగా చంపి ఆమె శ‌రీరాన్ని 35 ముక్క‌లుగా చేసి .. న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా ప‌డేశాడు. ఈ కేసులో తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది.


స‌మీప అడ‌వుల్లో శ్ర‌ద్ధా శ‌రీర భాగాల‌ను సేక‌రించిన పోలీసులు వాటిని డీఎన్ఏ ప‌రీక్షకు పంపారు. అయితే దిల్లీ అడ‌వుల్లో దొరికిన ఎముక‌లు శ్ర‌ద్ధావేనని డాక్ట‌ర్లు తేల్చారు. ఈ మేరకు డీఎన్ఏ ప‌రీక్ష ద్వారా నిర్ధర‌ణయిన‌ట్లు తెలుస్తోంది. మెహ‌రౌలీ, గురుగ్రామ్ అడ‌వుల నుంచి దిల్లీ పోలీసులు శ్ర‌ద్ధా ఎముక‌ల్ని సేక‌రించారు. ఆ ఎముక‌ల‌కు జ‌రిపిన ప‌రీక్ష‌లో.. ఆమె తండ్రి డీఎన్ఏతో మ్యాచ్ అయిన‌ట్లు గుర్తించారు.


శ్రద్ధా వాకర్‌ను ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో అఫ్తాబ్ ఇటీవలే పోలీసులకు వెల్లడించాడు. బంబుల్‌ డేట్‌ యాప్‌లో పరిచయమైన వ్యక్తిని శ్రద్దా కలిసిందని దీనిపైనే తమ మధ్య గొడవ జరిగినట్లు పోలీసులకు అఫ్తాబ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆ గొడవ వల్లనే ఆమెను హత్యను చేసినట్లు నిందితుడు ఆఫ్తాబ్‌ పూనావాలా ఒప్పుకున్నాడు.


బంబుల్‌ డేట్‌ యాప్‌లో పరిచయమైన వ్యక్తిని శ్రద్దా వాకర్‌ మే 17న గురుగ్రామ్‌లో కలిసిందని నిందితుడు అఫ్తాబ్‌ పోలీసులకు తెలిపాడు. ఆ తర్వాత మరునాడు మధ్యాహ్నం ఆమె తమ ఫ్లాట్‌కు తిరిగి వచ్చిందని చెప్పాడు. ఈ అంశంపై తమ ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందని, దీంతో ఆగ్రహంతో ఆమె గొంతునొక్కి హత్య చేసినట్లు దర్యాప్తులో అఫ్తాబ్ పేర్కొన్నాడు. కొంత కాలంగా తాము సన్నిహితంగా కాకుండా కేవలం రూమ్‌మేట్స్‌గా నివసిస్తున్నట్లు అఫ్తాబ్ వెల్లడించాడు.


మరోవైపు శ్రద్ధా వాకర్‌ ఫోన్‌ కాల్స్‌, లొకేషన్ టవర్‌ డేటా ఆధారంగా దిల్లీ పోలీసులు కూడా ఈ విషయాన్ని నిర్ధరించారు. అలాగే బంబుల్‌ డేట్‌ యాప్‌కు లేఖ రాసి ఆమె కలిసిన వ్యక్తి వివరాలు తెలుసుకున్నారు. అయితే గురుగ్రామ్‌లో శ్రద్ధా కలిసిన వ్యక్తి వివరాలు పోలీసులు బయటపెట్టలేదు.


కత్తి రికవరీ


శ్రద్ధాను హత్య చేసిన తర్వాత ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసేందుకు అఫ్తాబ్.. చైనీస్ కత్తిని ఉపయోగించినట్లు సీనియర్ దిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. గురుగ్రామ్‌లోని తన కార్యాలయం సమీపంలోని పొదల్లో ఆ కత్తిని అఫ్తాబ్ విసిరేసినట్లు తెలిసింది. ఈ విషయాన్న అఫ్తాబ్.. నార్కో పరీక్షలో అంగీకరించాడు. శ్రద్ధా తలను మెహ్రౌలీ అడవుల్లో పడేసినట్లు దిల్లీ పోలీసులకు అఫ్తాబ్ వెల్లడించాడు.


నార్కో పరీక్షలు


నిందితుడు అఫ్తాబ్ పూనావాలాకు నార్కో అనాలసిస్‌ పరీక్షలు ఇటీవల పూర్తయ్యాయి. దిల్లీ ఆసుపత్రిలో అఫ్తాబ్‌కు రెండు గంటల పాటు నార్కో పరీక్ష కొనసాగింది. పరీక్ష  ముగిసిందని ఆ సమయంలో అఫ్తాబ్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని అధికారులు వెల్లడించారు.


నార్కో పరీక్ష చేసే ముందు టెస్ట్‌ గురించి అఫ్తాబ్‌కు నిపుణుల బృందం వివరించింది. అతడి అంగీకారం తీసుకుంది. అనంతరం 10 గంటలకు నార్కోటెస్ట్‌ మొదలుపెట్టిన అధికారులు.. సుమారు రెండు గంటలపాటు నిందితుడిని ప్రశ్నించినట్లు సమాచారం. 


శ్రద్ధాను అత్యంత దారుణంగా హతమార్చినట్లు నిందుతుడు విచారణలో అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల నిర్వహించిన పాలిగ్రాఫ్‌ టెస్టులోనూ తన నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. పాలిగ్రాఫ్‌ టెస్టు సమయంలో శ్రద్ధాను తానే హత్య చేశానని.. అందుకు తనకేమీ పశ్చాత్తాపం, బాధ లేదని చెప్పినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. హత్యానంతరం ఆమె శరీర భాగాలను అడవిలో పడేసినట్లు అఫ్తాబ్ ఒప్పుకున్నాడని సమాచారం.


ఆమెను హత్య చేయాలని చాలా కాలం క్రితమే అఫ్తాబ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. చాలా మంది అమ్మాయిలతో తనకు శారీరక సంబంధం ఉన్నట్లు అఫ్తాబ్ ఒప్పుకున్నాడు. శ్రద్ధాను హత్య చేసిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులకు అఫ్తాబ్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఒప్పుకున్నాడు.


Also Read: Jagannath Temple: ఇక పూరీ జగన్నాథ్ ఆలయంలో సెల్‌ఫోన్లు పూర్తిగా నిషేధం!