Jagannath Temple: ఒడిశాలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రం పూరీ జగన్నాథ స్వామి ఆలయ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఆలయంలోకి స్మార్ట్‌ ఫోన్లు తీసుకెళ్లడాన్ని పూర్తిగా నిషేధించారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి నిబంధనలు అమల్లోకి రానున్నాయని ఆలయ అధికారులు వెల్లడించారు.


గతంలో


ఆలయంలోకి సెల్‌ ఫోన్లు తీసుకువెళ్లకుడదనే నిబంధన గతంలో భక్తులకు మాత్రమే ఉండేది. అయితే సెల్ ఫోన్ల నిషేధాన్ని ఈసారి పోలీసు సిబ్బందితో పాటు అందరికీ వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు.


ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ముందు సేవకులు కూడా తమ స్మార్ట్‌ ఫోన్లను ఆలయం బయట డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.


అయితే ఆలయ అధికారులు, సేవకులు మాత్రం ఫొటోలు, వీడియోలు తీసే ఫీచర్లు లేని బేసిక్ మోడల్ ఫోన్లను తీసుకెళ్లొచ్చని శ్రీ జగన్నాథ ఆలయం చీఫ్ అడ్మినిస్ట్రేటర్ వీర్ విక్రమ్ యాదవ్ తెలిపారు.