Praveen Tambe: 2022 ఏడాది ముగింపుకొచ్చేసింది. ఇంకా 15 రోజులు మాత్రమే మిగిలున్నాయి ఈ ఏడాదిలో. అందరూ ఈ సంవత్సరం మొత్తం ఏం చేశామో ఓసారి మననం చేసుకుంటున్నారు. అలాగే చాలామందికి ప్రముఖులు, సెలబ్రిటీలు ఏం చేశారో తెలుసుకోవాలని ఉంటుంది. అలాగే గూగుల్ లో ఎక్కువగా ఏం వెతికారు? ఎందుకు వెతికారు? ఎవరి గురించి ఎక్కువ సెర్చ్ చేశారు? అని తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం గూగుల్ లో ఎక్కువగా వెతికిన క్రీడాకారుడు ఎవరో మీకు తెలుసా! అలాంటి ఒక వ్యక్తి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, లేక వేరే దేశానికి చెందిన పాపులర్ ఆటగాళ్లు. గూగుల్ లో వెతికితే ఎవరైనా ఈ క్రీడాకారుల గురించి వెతుకుతారు. ఇప్పుడు ధోనీ ఏం చేస్తున్నాడు? రోహిత్ భారత జట్టును ఎలా నడిపిస్తున్నాడు? మునుపటి ఫాం అందుకున్న కోహ్లీ ప్రస్తుతం ఎన్ని సెంచరీలు చేశాడు? ఇలాంటి ప్రశ్నలు గూగుల్ ను వేస్తారని మనం అంచనా వేస్తాం. అయితే వీరెవరూ కాదు. ఇలాంటి ప్రశ్నలు లేనే లేవు. మరి గూగుల్ లో ఏ ఆటగాడి గురించి ఎక్కువ వెతికారు అనే అనుమానం వస్తుందా. అక్కడికే వస్తున్నాం.
అతి పెద్ద వయసులో ఐపీఎల్ అరంగేట్రం
అతను 41 ఏళ్ల వయసులో ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు భారత జాతీయ జట్టుకు ఆడలేదు. అయినా సరే అతని గురించే గూగుల్ లో ఎక్కువ శోధించారట. ఆ ఆటగాడే ప్రవీణ్ తాంబే. ఇతని గురించి బాలీవుడ్ లో సినిమా కూడా వచ్చింది. హిందీ నటుడు శ్రేయస్ తల్పడే టైటిల్ రోల్ పోషించాడు. ఐపీఎల్ లో ఆడిన అతి పెద్ద వయస్కుడిగా తాంబే రికార్డు సృష్టించాడు. దీని వల్లే అతని గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపించారు.
హ్యాట్రిక్ హీరో
2013 ఐపీఎల్ సీజన్ లో అతను రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేశాడు. లెగ్ స్పిన్ బౌలింగ్ చేసే తాంబేకు ఐపీఎల్ హ్యాట్రిక్ తీసిన రికార్డు కూడా ఉంది. ఆ ఎడిషన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై అహ్మదాబాద్ స్టేడియంలో ఆ ఫీట్ సాధించాడు. నైట్ రైడర్స్ ఆటగాళ్లు మనీష్ పాండే, యూసుఫ్ పఠాన్, ర్యాన్ టెన్ డోస్చాట్ లను ప్రవీణ్ ఔట్ చేశాడు. ఆ ఏడాది 15 వికెట్లు తీసి సీజన్ లో కొంతకాలంపాటు పర్పుల్ క్యాప్ ను అందుకున్నాడు. అలాగే రాయల్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు.