Dravid on Team India:


టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ఎప్పుడు జోరు పెంచాలో, ఎప్పుడు నియంత్రణతో ఆడాలో అతడికి బాగా తెలుసన్నాడు. సాధన చేస్తున్నప్పుడు అతడి ఇంటెన్సిటీ ఏ మాత్రం తగ్గదని వెల్లడించాడు. వన్డేల్లో అతడు ప్రవేశపెట్టిన టెంప్లేట్‌ అద్భుతమని పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిశాక మిస్టర్‌ డిపెండబుల్‌ మాట్లాడిన వీడియోను బీసీసీఐ విడుదల చేసింది.


'ఆటలో ఎప్పుడు దూకుడు పెంచాలో ఎప్పుడు నియంత్రించాలో విరాట్‌ కోహ్లీకి బాగా తెలుసు. అతడి ఆట చూడటం ఎంతో బాగుంటుంది. అతడిలాగే కొనసాగితే భారత క్రికెట్‌కు మేలు జరుగుతుంది.  వన్డే క్రికెట్లో విరాట్‌ టెంప్లేట్‌కు తిరుగులేదు. రికార్డులే అతడి గురించి చెబుతాయి. ఇన్ని మ్యాచులు ఆడటం ఎంతో గొప్ప విషయం. అతడు మునుపటి ఫామ్‌ అందుకున్నాడు. గతంలో ఎన్నడూ లేనంత కఠినంగా సాధన చేస్తున్నాడు. ఏడాదికి పైగా అతడికి శిక్షణ ఇస్తున్నా. పరుగులు చేస్తున్నా చేయకపోయినా అతడి ఇంటెన్సిటీలో ఎలాంటి మార్పు ఉండదు. కొత్త కుర్రాళ్లకు అతడు ఆదర్శం' అని ద్రవిడ్‌ అన్నాడు.






ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్ ప్రవేశపెట్టడంతో జట్లన్నీ మరింత దూకుడుగా ఆడుతున్నాయని ద్రవిడ్‌ పేర్కొన్నాడు. ప్రతి మ్యాచులో ఫలితం రాబట్టేదుకు ప్రయత్నిస్తున్నాయని వెల్లడించాడు. 'టెస్టు మ్యాచులు ముగింపుకొచ్చే సరికి జట్లన్నీ దూకుడుగా ఆడుతున్నాయి. ఎక్కువ ఫలితాలు రావడం చూస్తున్నాం. గతంలో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగా ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. టెస్టు క్రికెట్లో అడాప్టబిలిటీ ముఖ్యం. అవసరమైనప్పుడు వేగంగా, వికెట్లు పడుతున్నప్పుడు నియంత్రణతో ఆడటం కీలకం. కఠిన సమయాల్లో మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నించాలి. ఇప్పుడు జట్లు అవసరాన్ని బట్టి ఆడుతున్న శైలిలో మార్పులు చేసుకుంటున్నాయి' అని ద్రవిడ్‌ అన్నాడు.


ఇక ఛటోగ్రామ్‌ టెస్టుపై టీమ్‌ఇండియా పట్టు బిగించింది. ఆతిథ్య బంగ్లాదేశ్‌పై ఆధిపత్యం సాధించింది. రెండోరోజే విజయానికి పునాదులు వేసుకుంది. తొలి ఇన్నింగ్సులో 404 పరుగులకు ఆలౌటైన భారత్‌ బ్యాటింగ్‌కు దిగిన ప్రత్యర్థిని భారీ దెబ్బకొట్టింది. ఆట ముగిసే సమయానికి 133/8కి పరిమితం చేసింది. మెహదీ హసన్‌ (16 బ్యాటింగ్‌; 35 బంతుల్లో 1x4, 1x6), ఇబాదత్‌ హుస్సేన్‌ (13 బ్యాటింగ్‌; 1x4, 1x6) అజేయంగా నిలిచారు. బంగ్లా 271 పరుగుల లోటుతో ఒత్తిడిలో పడిపోయింది. కుల్‌దీప్‌ యాదవ్‌ 4, మహ్మద్‌ సిరాజ్‌ 3 వికెట్లు పడగొట్టారు.