IND vs BAN 1st Test:
ఛటోగ్రామ్ టెస్టులో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 404 పరుగులకు ఆలౌటైంది. 278/6 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు, గురువారం రాహుల్ సేన బ్యాటింగ్ ఆరంభించింది. 82 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్ మరో 4 పరుగులే జోడించి ఔటయ్యాడు. త్రుటిలో సెంచరీ మిస్సయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ (58; 113 బంతుల్లో 2x4, 2x6) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మణికట్టు స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ (40; 114 బంతుల్లో 5x4) సమయోచిత స్కోరుతో విలువైన భాగస్వామ్యం అందించాడు.
యాష్, కుల్దీప్ అద్భుతం
రెండోరోజు శ్రేయస్ అయ్యర్ సెంచరీ చేస్తాడని అంతా భావించారు. అయితే ఇబాదత్ హుస్సేన్ అతడిని బౌల్డ్ చేశాడు. ఇలాంటి సిచ్యువేషన్‌లో టీమ్‌ఇండియా భారీ స్కోరు చేసిందంటే అందుకు అశ్విన్, కుల్‌దీప్ భాగస్వామ్యమే కారణం. వీరిద్దరూ బంగ్లా బౌలర్లను తెలివిగా అడ్డుకున్నారు. ఎనిమిదో వికెట్‌కు 200 బంతుల్లో 87 పరుగులు సాధించారు. కఠినమైన బంతుల్ని చక్కగా డిఫెండ్ చేశారు. సింగిల్స్‌తో స్ట్రైక్ రొటేట్ చేశారు. దాంతో లంచ్ టైమ్‌కు భారత్ 348/7తో నిలిచింది. ఆ తర్వాత యాష్ హాఫ్ సెంచరీ అందుకున్నాడు. రెండు భారీ సిక్సర్లు బాదిన అతడు 91 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టేశాడు. స్కోరు వేగం పెంచే క్రమంలో మెహదీ హసన్ 131.2వ బంతిని ఆడబోయి స్టంపౌట్ అయ్యాడు. ఆఖర్లో ఉమేశ్ యాదవ్ (15*)తో కలిసి కుల్‌దీప్ ఇన్నింగ్స్ నడిపించాడు. హాఫ్ సెంచరీ ముందు అతడిని తైజుల్ ఇస్లామ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో టీమ్‌ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది.
Also Read: ప్రపంచ కుబేరుల్లో మస్క్ ఇప్పుడు నంబర్.2 - నంబర్.1 ఎవరంటే?
Also Read: మరోసారి వడ్డీ రేటు పెంచిన యూఎస్ ఫెడ్, అయితే ఈసారి కాస్త ఊరట