Kane Williamson Resigns: 


న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ క్రికెట్‌ అభిమానులకు షాకిచ్చాడు. టెస్టు పగ్గాలను వదిలేస్తున్నానని ప్రకటించాడు. పనిభారం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించాడు. రాబోయే రెండేళ్లలో రెండు ప్రపంచకప్‌లు ఉండటం మరో కారణమని వెల్లడించాడు. సీనియర్‌ ఆటగాడు, పేస్‌ బౌలర్‌ టిమ్‌ సౌథీ సారథిగా అర్హుడని ప్రశంసించాడు. వైస్‌ కెప్టెన్‌ టామ్‌ లేథమ్‌ను అభినందించాడు.


2016 నుంచి కెప్టెన్సీ


విలియమ్సన్‌ సారథ్యంలో న్యూజిలాండ్‌ మూడు ఫార్మాట్లలో రాణించింది. ఐసీసీ ప్రవేశపెట్టిన అరంగేట్రం టెస్టు ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. 2015 నుంచి ఐసీసీ ప్రపంచకప్‌ పోటీల్లో రన్నరప్‌గా నిలుస్తోంది. ఇక కేన్‌మామ 38 టెస్టుల్లో కివీస్‌కు కెప్టెన్సీ చేశాడు. 22 విజయాలు, 8 డ్రాలు, 10 ఓటములు అందించాడు. 2016 నుంచి అతడు సుదీర్ఘ ఫార్మాట్‌కు నాయకుడిగా ఉన్నాడు. కొత్త సారథి టిమ్‌ సౌథీ కివీస్‌ తరఫున 346 అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు. 22 టీ20 మ్యాచుల్లో జట్టును నడిపించాడు. పాకిస్థాన్‌ పర్యటన నుంచి బాధ్యతలు స్వీకరిస్తాడు. వైస్‌ కెప్టెన్‌గా ఎంపికైన టామ్ లేథమ్ గతంలో కేన్‌ లేనప్పుడు నాయకత్వం వహించాడు.


Also Read: ప్రపంచ కుబేరుల్లో మస్క్‌ ఇప్పుడు నంబర్‌.2 - నంబర్‌.1 ఎవరంటే?


Also Read: మరోసారి వడ్డీ రేటు పెంచిన యూఎస్‌ ఫెడ్, అయితే ఈసారి కాస్త ఊరట


నాకిదే అత్యంత గౌరవం


'టెస్టు క్రికెట్లో న్యూజిలాండ్‌కు సారథ్యం వహించడం గొప్ప గౌరవం. నా వరకైతే సుదీర్ఘ ఫార్మాటే క్రికెట్లో అత్యున్నతమైంది. జట్టును నడిపించడంలో ఎదురైన సవాళ్లను ఆస్వాదించాను. నాయకత్వం వల్ల మైదానం బయట, లోపలా పనిభారం పెరుగుతుంది. అందుకే బాధ్యతల నుంచి తప్పుకొనేందుకు ఇదే సరైన సమయంగా భావించా. రాబోయే రెండేళ్లలో రెండు ప్రపంచకప్‌లు ఉన్నాయి. కాబట్టి న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డుతో చర్చించాక పరిమిత ఓవర్ల క్రికెట్లో కెప్టెన్‌గా కొనసాగాలని నిర్ణయించుకున్నా. కెప్టెన్‌గా టిమ్‌ సౌథీ, వైస్‌ కెప్టెన్‌గా టామ్ లేథమ్‌కు అండగా నిలిచేందుకు ఆసక్తిగా ఉన్నా. వారు అద్భుతంగా పనిచేస్తారన్న నమ్మకం ఉంది. కివీస్‌కు మూడు ఫార్మాట్లలో ఆడటమే నాకు అత్యంత ముఖ్యం. మున్ముందు జరిగే క్రికెట్‌పై ఎగ్జైటింగా ఉన్నా' అని కేన్‌ విలియమ్సన్‌ అన్నాడు.