Blind T20 World Cup 2022:  భారత అంధుల క్రికెట్ జట్టు అదరగొట్టింది. సమష్టి ప్రదర్శనతో అంధుల టీ20 ప్రపంచకప్ ఫైనల్ కు దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లో ఆ జట్టును 207 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. 


టీమిండియా అంధుల క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్ ఫైనల్ కు వెళ్లింది. గురువారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో భారత జట్టు కెప్టెన్, ఆంధ్రప్రదేశ్ ఆటగాడు అజయ్ కుమార్ రెడ్డి ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 337 పరుగుల భారీ స్కోరు సాధించింది. అజయ్ 81 పరుగులు, సునీల్ రమేశ్ 110 పరుగులు చేశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికాను టీమిండియా బౌలర్లు వణికించారు. అజయ్ కుమార్ రెడ్డి కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లూ రాణించటంతో సౌతాఫ్రికా 19.5 ఓవర్లలో కేవలం 130 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ 207 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. శనివారం జరిగే ఫైనల్ లో టీమిండియా బంగ్లాదేశ్ తో తలపడనుంది. 






ఇప్పటి వరకు భారత అంధుల జట్టు 2 సార్లు ట్రోఫీని గెలుచుకుంది. 2012, 2017 ల్లో ఫైనల్లో దాయాది పాకిస్థాన్ ను ఓడించి కప్ అందుకుంది. 


అజయ్ కుమార్ రెడ్డి ప్రస్థానం


1990లో జన్మించిన అజయ్ కుమార్ రెడ్డి మొదటిసారిగా 2010లో అంతర్జాతీయ స్థాయిలో ఇంగ్లండ్ తో ఆడాడు. 2014 వన్డే ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఇక 2016 ఆసియా కప్ లో భారత జట్టుకు కెప్టెన్ గా ఎంపికై జట్టుకు ట్రోఫీ అందించాడు. అజయ్ సారథ్యంలో టీమిండియా అంచెలంచెలుగా ఎదిగింది. ఎన్నో విజయాలు సాధించింది. అలాగే జట్టుకు రెండు ప్రపంచకప్ లను అందించాడు.