10th September 2024 News Headlines:


నేటి ప్రత్యేకత


  • కవి సమ్రాట్, తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ  జయంతి

  • ప్రముఖ చిత్రకారుడు  వడ్డాది పాపయ్య, జయంతి

  • తెలంగాణా వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి


 

ఆంధ్ర ప్రదేశ్ వార్తలు: 


  • విజయవాడ ముంపు బాధితులకు ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పడమర విప్పర్రు గ్రామంలోని శ్రీ విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు తమ పాకెట్ మనీని వరద బాధితులకు విరాళంగా ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారు. ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేసిన సీఎం చంద్రబాబు.. చిట్టి చేతులు పెద్ద సాయం చేశాయంటూ ప్రశంసలు కురిపించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

  • ఆంధ్రప్రదేశ్‌లో వరద నష్టం అంచనాల విధి విధానాల రూపకల్పన, వరద సాయం పర్యవేక్షణకు మంత్రి వర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పయ్యావుల కేశవ్‌, నారాయణ, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్‌లతో కేబినెట్ సబ్ కమిటీని సర్కారు ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కన్వీనరుగా రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్‌ను నియమించారు. 


 తెలంగాణ వార్తలు: 


  •  తెలంగాణలో అకాల వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం బృందాన్ని పంపనుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కర్నల్‌ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం బుధవారం నుంచి ఆస్తి, పంట నష్టాన్ని అంచనా వేయనుంది. 

  • హైదరాబాద్‌ శివారులో గ్రీన్‌ ఫార్మా సిటీ అభివృద్ధిని వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. గ్రీన్‌ ఫార్మా సిటీపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన రేవంత్‌.. పర్యావరణ హితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నూతన సాంకేతికతను ఉపయోగించుకోవాలని సూచించారు. రోడ్లు, తాగునీరు, విద్యుత్‌, డ్రైనేజీ సౌకర్యాలు వీలైనంత త్వరగా చేపట్టలన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


జాతీయ వార్తలు: 



  • పద్మ అవార్డులకు దరఖాస్తులు చేసుకునేందుకు గడువు సమీపిస్తున్న వేళ స్ఫూర్తిదాయకమైన వ్యక్తులను నామినేట్ చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 15తో పద్మ అవార్డుల నామినేషన్లకు గడువు ముగియనుంది. తమ ప్రభుత్వ హయాంలో ఎంతోమంది అట్టడుగు స్థాయిలో ఉన్న హీరోలను పద్మ అవార్డులతో సత్కరించామని మోదీ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

  • భారత్‌లో నమోదైన మంకీపాక్స్‌ కేసు.. పశ్చిమ ఆఫ్రికాలో వ్యాప్తిలో ఉన్న క్లేడ్‌-2 రకంగా తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించి ఆత్యయిక స్థితికి కారణమైన క్లేడ్‌-1 కాదని.. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మంకీపాక్స్‌ 1958లో డెన్మార్క్‌లో తొలిసారి కోతుల్లో వెలుగు చూసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

  • క్యాన్సర్‌ చికిత్సలో ఉపయోగించే మందుల ధరలపై జీఎస్టీని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ కౌన్సిల్‌ 54వ సమావేశంలో క్యాన్సర్ మందులపై జీఎస్టీని 12శాతం నుంచి 5శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ప్రభుత్వ అనుబంధ విద్యాసంస్థలను జీఎస్టీ నుంచి మినహాయించినట్లు వెల్లడించారు.

  • బెంగళూరు రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసులో NIA ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. నలుగురిపై అభియోగాలు మోపింది. అయోధ్య ప్రాణప్రతిష్ఠ రోజున బెంగళూరు బీజేపీ ఆఫీస్‌పై దాడికి యత్నించి విఫలమయ్యారని పేర్కొంది. నిందితులను ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా, మాజ్ మునీర్ అహ్మద్, ముజమ్మిల్ షరీఫ్‌గా గుర్తించి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. వీరు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

  • హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్  ఛైర్మన్, ఎండీగా డాక్టర్ డీకే సునీల్‌ నియమితులయ్యారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో సుమారు 37 ఏళ్ల అనుభవం ఉన్న డాక్టర్‌ సునీల్‌.. 1987లో సంస్థలో మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేరారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో సునీల్‌ గ్రాడ్యుయేషన్ చేశారు. 


క్రీడా వార్తలు:



  • చైనాలో జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత హాకీ జట్టు జోరు కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య జట్టు చైనాని మట్టికరిపించిన డిఫెండింగ్‌ ఛాంపియన్... జపాన్‌పై 5-1 తేడాతో గెలిచి వరుసగా రెండో విజయాన్ని సాధించింది. భారత్‌ తరఫున సుఖ్‌జీత్‌, అభిషేక్‌, సంజయ్‌, ఉత్తమ్‌ సింగ్‌ గోల్స్‌ చేశారు. 


 

మంచిమాట

ఆత్మాభిమానం లేనివాడు మనిషిగా ఎదగలేడు: స్వామి వివేకానంద