School Children Donates Pocket Money For Flood Relief: విజయవాడలో (Vijayawada) వరద బీభత్సం సృష్టించి తీవ్ర విషాదం మిగిల్చిన క్రమంలో దాతలు స్పందించి తమకు తోచిన సాయం చేస్తున్నారు. కొందరు ఉచితంగా సర్వీసులు అందిస్తుంటే ఇంకొందరు డబ్బు రూపేణా తమకు తోచిన సాయం చేస్తున్నారు. సినీ ప్రముఖులు, పలు సంస్థలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీగా విరాళాలు అందిస్తున్నాయి. ఓ వ్యక్తి తన రోజు కూలీ డబ్బు రూ.600 సీఎంఆర్ఎఫ్‌కు అందజేశారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ ప్రశంసలు కురిపించారు. తాజాగా, బాధితులకు అండగా 'మేము సైతం' అంటూ చిన్నారులు ముందుకొచ్చారు. తమకు తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని సీఎంఆర్ఎఫ్‌కు అందించి గొప్ప మనసు చాటుకున్నారు.
వీడియో షేర్ చేసిన సీఎం
పశ్చిమగోదావరి జిల్లా పడమర విప్పర్రు గ్రామంలోని శ్రీ విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు తమ పాకెట్ మనీని వరద బాధితుల కోసం విరాళంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను సీఎం చంద్రబాబు (CM Chandrababu) ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. చిట్టి చేతులు పెద్ద సాయం చేశాయంటూ ప్రశంసలు కురిపించారు. ఈ వీడియో తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని.. విద్యార్థులకు ఉన్నత విలువలు నేర్పుతున్న స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. ఇతరులను గౌరవించడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం వంటి లక్షణాలు చిన్నారుల్లో మానవత్వాన్ని పెంచుతాయని.. చిన్నారులను బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దుతాయని చంద్రబాబు పేర్కొన్నారు.
విరాళాల వెల్లువ
విజయవాడ వరద బాధితుల సహాయార్థం సీఎంఆర్ఎఫ్‌కు పలువురు ప్రముఖులు భారీగా విరాళాలు అందిస్తున్నారు. తాజాగా, లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అధినేత ఎమ్.కిరణ్ కుమార్ రూ.కోటి విరాళం అందించి తన గొప్ప మనసు చాటుకున్నారు. సోమవారం సీఎం చంద్రబాబును స్వయంగా కలిసిన ఆయన చెక్కును అందించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్‌ను సీఎం అభినందించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం చంద్రబాబు 75 ఏళ్ల వయసులోనూ నిరంతరం కష్టపడుతున్నారని కిరణ్ కుమార్ ప్రశంసించారు.
ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటన
మరోవైపు, ముంపు ప్రాంతాల్లో సోమవారం సీఎం చంద్రబాబు పర్యటించారు. కబేళా సెంటర్‌లో బాధితులతో మాట్లాడారు. 9 రోజులుగా ప్రజలు పడిన బాధ వర్ణించలేమని.. వారి కష్టాలు తీర్చేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నామని తెలిపారు. తనతో పాటు మంత్రులు, అధికారులు బురద, నీటిలో తిరుగుతూ సహాయక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. బుడమేరుకు గండ్లు పడినా గత పాలకులు పట్టించుకోలేదని.. ఆ ప్రాంతాన్ని కబ్జా చేశారని మండిపడ్డారు. బెంగుళూరులో కూర్చొని తమపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదల్లో నష్టపోయిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామని.. వారికి ఉపాధి మార్గాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.